సినీ ఫీల్డ్‌లో ఉన్నవారిపై ఒక అపోహ ఉంది. దీనిని అపోహ అనలేం. ఎందుకంటే కొందరు నిజంగానే దారితప్పారు. దీంతో సినీ రంగంలో ఉన్నవారిపై ఒక ముద్ర ఉండేది. వారికి అన్ని అలవాట్లు ఉంటాయని.. వారితో స్నేహం చేస్తే.. తమ పిల్లలు కూడా పాడైపోతారని ఇలా అనే అపోహలు హల్చల్ చేసేవి. అయితే.. ఇలాంటి వాటికి చాలా తక్కువ మంది మాత్రమే దూరంగా ఉన్నారు. నాటి బ్లాక్ అండ్ వైట్ డేస్‌లోనే ఈ చర్చ జోరుగా సాగిన పరిస్థితి ఉంది. కానీ, అక్కినేని నాగేశ్వరరావు, నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి వారు చాలా నిబద్ధతతో ఉండేవారు.
అసలు హీరో, హీరోయిన్లు అప్పట్లో తెరవెనక చాలా తతంగాలే నడిపించేవారు. హీరోయిన్లు కూడా హీరోలతో వ్యవహారాలు మెయింటైన్ చేస్తే వారి సినిమాల్లో ఛాన్సులు వస్తాయని వారే ఎక్కువుగా మూవ్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇక అప్పట్లో ఆంధ్రుల అందాల నటుడు ఎన్టీఆర్ అంటే మరింతగా క్రేజ్ ఉండేది. పుంసాం మోహన రూపాయ అన్నట్టుగా ఎన్టీఆర్ ను చూస్తే అందరికీ నచ్చబుద్దే..! దీంతో ఆయనపై మరింతగా చర్చలు సాగుతుండేవి. కానీ, ఎన్టీఆర్ ఎలాంటి వ్యామోహాల జోలికీ పోలేదు.
తను ఎక్కడా దారి తప్పలేదు. తను చేయాలని అనుకున్న సినిమా చేయడం.. నేరుగా ఇంటికి రావడం మాత్రమే చేసేవారు తప్ప, ఎక్కడా దారి తప్పిన చరిత్ర ఎన్టీఆర్‌కు లేదు. అయితే, ఆయనకు అంతకుముందే ఉన్న సిగరెట్ తాగే అలవాటును మాత్రం వదులుకోలేదు. సిగరెట్ తప్ప.. ఇతర దుర్వ్యసనాలు అన్నగారికి లేవనే చెప్పాలి. ఎందుకంటే,ఆయన నట జీవితంలో అనేక మందిని చూశారు. వివాహేతర సంబంధాలు, ప్రేమలు, మద్యం అలవాటు, గుర్రపు పందేలు ఒక్కటనికాదు.. అనేక మందితో పరిచయం ఉండడంతో ఇలాంటి వారుకూడా ఎన్టీఆర్ కు తారసపడ్డారు.
అయితే, వారు ఎలా దెబ్బతిన్నారో అన్నగారు ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో వాటికి దూరంగా ఉండేందుకే అన్నగారు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆయన ఇటు నిజ జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందిన మహామనీషిగా మారారు. ఆదర్శంగా జీవించారు.