చిత్తూరు వీ. నాగయ్య. ఇప్పటి తరానికి అసలు పేరు కూడా తెలియదు. కానీ, ఈయనకు బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో నిర్మాతలు, దర్శకులు బ్రహ్మరథం పట్టేవారు. ఈయన కుటుంబంలో పెద్ద వెలితి.. ఆయనకు పిల్లలు లేకపోవడమే. దీంతో ఆయనపై అపారమైన అభిమానం చూపించిన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లను నాగయ్య కన్నబిడ్డలుగా చూసుకునేవారట. దీంతో వీరు కూడా ఆయనను నాన్నగారూ..! అని ఎంతో గౌరవంగా పిలుచుకునేవారట. ఇక, నాగయ్య ఒక్క నటుడే కాదు.. సంగీత దర్శకుడు, సిని దర్శకుడు కూడా. అంతేనా.. అత్యంత తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో నాగయ్యను మించిన వారు లేరనేవారు.
ఎందుకంటే.. కష్టమైనా.. నష్టమైనా.. ముందు ఖర్చు తగ్గించుకుని అడుగులు వేస్తే మంచిదనే అభిప్రాయం ఆయనలో ఉండేది. అయితే.. ఎంత ఖర్చు తగ్గించుకుని పొదుపుగా సినిమా తీస్తారో.. అంత రాబడి వచ్చేదట ఆయా సినిమాలకు. నాగయ్య హీరోగా వేమన సినిమా వచ్చినప్పుడు.. పోలీసులు లాఠీ చార్జి చేసి.. ఆయన అభిమానులను కంట్రోల్ చేశారంటే.. ఆయనకు ఉన్న ఇమేజ్ ఏంటో అప్పట్లో అర్ధమవుతుంది. అంతేకాదు.. హీరోలకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేవారు.
అదే సమయంలో కార్లు కొనేందుకు కూడా ఎక్కువగానే వెచ్చించేవారట. ఏది అధునాతనం అని అంటే.. దాన్ని కొనేసేవారట. తాను కొన్న కారులొ సినీ ఆర్టిస్టులు అందరినీ ఎక్కించుకుని ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి విందులు కూడా ఇచ్చేవారట. ఇక, తన వద్దకు వచ్చేవారికి ఏదో ఒకటి చేతిలో పెట్టకుండా పంపేవారు కారట. తాను పుట్టిన ఏపీ అంటే ఆయనకు ఎంతో మక్కువ. పైగా.. ఏపీ నుంచి ఎవరైనా మద్రాస్ వచ్చి సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే.. తనే స్వయంగా వెళ్లి వారిని పలకరించి.. ఇంట్లో ఆశ్రయం కల్పించేవారట.
ఇలా వచ్చిన వారిలో ఎంతో మంది తర్వాత కాలంలో హీరోలుగా ఎదిగారని అంటారు. వీరిలో శోభన్‌బాబు కూడా ఒకరు. అయితే.. నాగయ్యకు ఉన్న ఈ మంచి అలవాటే.. ఆయనను రూపాయి లేకుండా చేసింది. అయితే.. ఈ విషయంపై ఎంతో జాగ్రత్తగా ఉండే ఎన్టీఆర్.. తరచుగా.. నాన్నగారు డబ్బు వృథా చేస్తున్నారు అని హెచ్చరించేవారట. కానీ, ఆయనేమో.. సుతిమెత్తగా నవ్వి.. నేను సంపాయించానా ? పైవాడు ఇచ్చిందే కదా! అని పారమార్థికంగా మాట్లాడేవారట. చివరి దశలో అంత్యక్రియలకు అన్నగారు ఖర్చు చేసి.. సాగనంపినట్టు.. గుమ్మడి రాసుకున్నారు.