చిరంజీవి, బాలకృష్ణ అంటేనే పోలికలు మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి. సినిమాలతో మొదలు పెడితే, కలెక్షన్లు, రికార్డులు, ఒకేసారి ఇద్దరు సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటు చివరకు బయట, రాజకీయాల్లో కూడా వీరిని కంపేరిజన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగంతో పాటు ఇద్దరూ బుల్లితెరమీదకు రావడంతో ఇక్కడ కూడా ఈ పోలికలు తప్పడం లేదు. వెండితెరపై 31 సార్లు వీరిద్దరు ఒకేసారి తమ సినిమాలు రిలీజ్ చేసి పోటిపడితే ఒక్కోసారి ఒక్కొక్కరు పైచేయి సాధించారు.
అయితే రెండు సార్లు చిరంజీవితో పోటీపడి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత ( సమరసింహారెడ్డి, నరసింహానాయుడు) మాత్రం బాలయ్యదే. ఇక చాలా యేళ్ల తర్వాత ఇద్దరూ 2017 సంక్రాంతికి తమ కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ సినిమాలు చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీపడ్డారు. ఈ పోటీలో చిరు సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చినా.. బాలయ్య సినిమాకే మంచి పేరు వచ్చింది.
చిరు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండడం, తమిళ్‌లో హిట్ అయిన విజయ్ కత్తి సినిమాకు రీమేక్ చేయడంతో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అయితే బాలయ్య అంత ల్యాండ్ మార్క్ సినిమాకు డేర్ చేసి హిస్టారికల్ సినిమాను ఎంచుకోవడంతో ప్రశంసలు కూడా ఎక్కువ వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరు బుల్లితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో బుల్లితెరపై కూడా ఎవరు ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తున్నారన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు షో అంతగా ఆకట్టుకోలేదు. ఇక బాలయ్య అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ బ్లాక్‌బస్టర్. రెండో సీజన్ కూడా అంతే స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు బుల్లితెరతో పాటు మరో విషయంలోనూ ఇద్దరి మధ్య కంపేరిజన్లు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌లో సినిమా ఫంక్షన్లకు గెస్టులుగా ఎవరిని పిలవాలి అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ఎక్కువుగా వినిపించేవి. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా బాలయ్య ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
బాలయ్య రీసెంట్‌గా అల్లు హీరో శిరీష్ ఊర్వశి..రాక్షసి సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. సినిమాకు మంచి టాకే వచ్చింది. చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్‌కు ఇది మంచి హిట్. ఇక ఇప్పుడు విశ్వక్‌సేన్ ధమ్కీ ఫంక్షన్‌కు కూడా గెస్ట్‌గా వచ్చాడు బాలయ్య. ఇక నందమూరి ఫ్యాన్స్ హడావిడి అయితే మామూలుగా లేదు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే అంటున్నారు. పైగా బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అయితే బాలయ్య ఈ విషయంలో కూడా చిరుతో పోలిస్తే ముందున్నట్టు అవుతుందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి.