మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో 150 కు పైగా సినిమాల్లో నటించారు. వచ్చే సంక్రాంతి కానుకగా చిరు నటించిన 154 సినిమా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగు దశాబ్దాల కెరీర్ లో చిరంజీవి ఎంతోమంది హీరోలు, హీరోయిన్లతో నటించారు. అలాగే కొన్ని వందల మంది టెక్నీషియన్ లతో కలిసి పని చేశారు. రీసెంట్గా చిరు రూట్ మార్చి యంగ్ హీరోలతో కూడా కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆచార్య సినిమాలో తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించారు. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే గతంలోనూ రవితేజతో అన్నయ్య సినిమాలో కలిసి నటించారు. అన్నయ్య సినిమాలో రవితేజ, వెంకట్ చిరుకు తమ్ముళ్లుగా కనిపించి మెప్పించారు. ఇక చిరంజీవి తన మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో కూడా కలిసి గతంలో నటించారు. తనకు మేనల్లుళ్లు అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అల్లు శిరీష్ తో కూడా చిరు సినిమాల్లో నటించారు.
అయితే అల్లు అర్జున్ – అల్లు శిరీష్ హీరోలు కాకుండా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మేనమామ చిరంజీవి సినిమాల్లో నటించడం విశేషం. ఈరోజు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలలో ఒకరుగా ఉన్న అల్లు అర్జున్ చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో ఐదు నిమిషాల పాటు ఒక సీన్లో కనిపించారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో రిలీజ్ అయిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ ఒక డ్యాన్సర్ గా కనిపించారు. ఆ సినిమాలో బన్నీ వేసిన డ్యాన్స్ మూమెంట్ అదిరిపోయింది.
ఇక అల్లు శిరీష్ కూడా చిరు సినిమాలో నటించారు. అప్పుడు శిరీష్ వయస్సు కేవలం మూడేళ్లు మాత్రమే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరు హీరోగా వచ్చిన ప్రతిబంధ్ హిందీ మూవీలో శిరీష్ కూడా కనిపించాడట. ఈ విషయాన్ని శిరీషే స్వయంగా చెప్పాడు. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు నిజంగా మేనమామ, మేనళ్లుల్లు కలిసి నటిస్తే మెగా గ్యాప్ అంటూ వస్తోన్న వార్తలకు చెక్ పడడంతో పాటు మెగాభిమానుల జోష్ మామూలుగా ఉండదు.