ఎన్టీఆర్‌తో సినిమాలు అంటే ఇతర హీరోలతో సినిమాలు చేసినంత ఈజీకాదనే టాక్ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉంది. స్వతహాగా.. ఆయన దర్శకుడు కావడం.. తెలుగుపై పట్టు ఉండడం..డైలాగులు.. కథపై ఆయనకు నిశిత దృష్టి ఉండడం సాధారణంగానే దర్శకులకు ఒకింత ఇబ్బందిగా ఉండేదట. ఈ క్రమంలోనే దర్శకులు కానీ.. నిర్మాతలు కానీ.. అన్నగారి దగ్గరకు వెళ్లి కథ చెప్పాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని.. అడుగులు వేసేవారు.
అది.. సర్దార్ పాపారాయుడు.. సినిమా తీయాలని నిర్ణయించుకున్న రోజులు. వాస్తవానికి.. దాసరి నారాయ ణరావు.. ఈ సినిమాకు.. శోభన్‌బాబును హీరోగా అనుకున్నారట. ఆయనను దృష్టిలో పెట్టుకుని కథ మొత్తం.. రెడీ చేసుకున్నారు. కానీ, ఎందుకో.. ఇంత బలమైన కథను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే.. అంతకుమించిన కథానాయకుడు ఉండాలని.. ఓ సందర్భంలో నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన నేరుగా ఎన్టీఆర్‌ను కలిసి.. ఇది మీకోసం.. రాసిన స్క్రిప్టు కాదు.. కానీ, మీరు నటిస్తే.. బాగుంటుందని చెప్పారట.
అవసరమైతే.. స్క్రిప్టును మార్చేస్తాం.. అన్నారట. దీనిపై ఖస్సున ఆగ్రహం వ్యక్తం చేసిన.. ఎన్టీఆర్.. ఎవరి నో దృష్టిలో పెట్టుకుని..చరిత్రను మారుస్తారా? ఇది తప్పు.. ఆయనతోనే.. చేసుకోండి.. అని సుతిమెత్తగా సూచించారట. కానీ,దర్శకుడు దాసరి మాత్రం అన్నగారితోనే తీయాలని అనుకున్నారు. దీంతో ఓ నైట్.. అన్నగారు.. వచ్చే వరకు ఎదురు చూశారట. (ఇద్దరి ఇళ్లు కూడా.. ఎదురెదురుగా ఉండేవి). అన్నగారు కారులోంచి దిగగానే.. వెళ్లి.. స్క్రిప్టు మార్చను.. డైలాగుల వరకు మారుస్తాను.. మీకు ఇష్టమేనా? అని ప్రశ్నించారట.
దీంతో డైలాగులు మార్చిన తర్వాత.. చూద్దాం.. అని అన్నగారు చెప్పడంతో.. సగం విజయం సాధించినట్టే అని భావించిన దాసరి.. అన్నగారికి తగిన విధంగా డైలాగులు మార్చుకుని స్క్రిప్టును మార్చకుండా.. తీసుకువెళ్లడంతో ఓకే చెప్పారట. సినిమా షూటింగ్ అయిపోయి.. ఎలా ఆడుతుందో అనుకున్న సందర్భంలో అన్నగారే ధైర్యం చెప్పారట. దిగులు పెట్టుకోకండి నారాయణరావు గారు.. బాగానే పోతుంది లే! అన్నారట. మరి ఆ సినిమా.. 365 రోజులు ఆడింది తెలిసిన విషయమే కదా..!