సినీ రంగంలో ఎన్టీ ఆర్ శైలే విభిన్నంగా ఉండేదని అంటారు. ఆయన వ్యవహారం అందరికీ ఆదర్శమనే టాక్ కూడా నడిచింది. నిర్మాతలకు గౌరవం ఇవ్వడం.. దర్శకులతో మర్యాదగా మసులుకోవడం.. ఇతర నటీనటులతో కలివిడిగా ఉండడం అనేది అన్నాగారి లోఉన్న గొప్ప లక్షణాలుగా అప్పట్లో చెప్పుకొనేవారు. ముఖ్యంగా ఎవరికి ఏ ఆపద వచ్చిందని తెలిసినా అన్నగారు ముందుండేవారు. రాజకీయాల్లోకి రాక ముందు వరకు ..ఆయన అందరితోనూ కలిసిమెలిసి తిరిగారు.
ఎక్కడా కూడా ఇగోలకు పోకుండా ఉండేవారు. తమిళనాడును తీసుకుంటే.. శివాజీ గణేశన్, రాజా, రజనీకాంత్, కరుణానిధి కుటుంబాలతో అన్నగారికి.. చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఇక, కన్నడ సినీ రంగానికి వస్తే.. ప్రఖ్యాత నటుడు రాజ్‌కుమార్ నుంచి దర్శకుల వరకు అనేక మందితో ఎన్టీఆర్ అద్వితీయమైన స్నేహాన్ని కొనసాగించారు. వీరిలో రాజ్‌కుమార్ కుటుంబంతో అన్నగారికి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది.
రాజ్‌కుమార్‌ను గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ అపహరించినప్పుడు.. అన్నగారు.. వారి ఇంటికి వెళ్లి.. కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా కూడా ఉన్నారు. కేంద్రంతోనూ.. మంతనాలు నెరిపి.. రాజ్‌కుమార్ త్వరగా వచ్చేలా చేశారు.ఇక, శివాజీ గణేశన్.. అనారోగ్యం పాలైనప్పుడు.. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. కరుణానిధితో ఆయనకు ఆసాంతం అనుబంధం కొనసాగింది.
టీడీపీలో సంక్షోభం వచ్చినప్పుడు కరుణానిధితో చర్చించి.. రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించారట. కరుణానిధి కూడా మీకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారట. మళ్లీ ప్రజలు మీకే పట్టం కడతారు. మీరు విజయం సాధిస్తారని చెప్పి ఎన్టీఆర్‌కు ధైర్యం చెప్పేవారట. అయితే.. ఈలోగానే అన్నగారు అనంత లోకాలకు వెళ్లిపోయారు.