టాలీవుడ్‌లోనే కాదు ఏ రంగంలో అయినా.. ఏ భాషకు చెందిన సినిమా రంగంలో అయినా స్టార్స్ మధ్య ఎంత లేదన్నా ఇగోలు, పంతాలు పట్టింపులు నడుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య కూడా ఇదే తరహా ఈగో వార్ కొన్నాళ్లుగా నడుస్తోంది. రాజమౌళి ఈగ హిట్ కొడితే త్రివిక్రమ్ నుంచి అభినందనలు ఉండవు. అదే బాహుబలితో రాజమౌళి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెపితే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు… అయితే త్రివిక్రమ్ నుంచి కనీసం ట్వీట్ కూడా ఉండదు. అదే త్రివిక్రమ్ సినిమాలు అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డులకు పాతరేస్తే రాజమౌళి నుంచి ప్రశంసలు ఉండవు.
రాజమౌళి తనకు నచ్చితే చిన్న సినిమాలను మాత్రమే కాదు.. ఇతర భాషలకు చెందిన బ్రహ్మాస్త్ర, సుదీప్ విక్రాంత్ రోణ లాంటి పెద్ద సినిమాలను కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా వాటిపై ఆయన రిప్లే ఉండదు. ఇక గత 15 ఏళ్లుగా మరో టాక్ కూడా ఉంది. రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్ లాంటి వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తే త్రివిక్రమ్ బన్నీ, మహేష్‌తోనే సినిమాలు చేశారు. మధ్యలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ అరవింద సమేత మాత్రమే చేశారు.
ఇక ఇప్పుడు రాజమౌళి – మహేష్ కాంబినేషన్ తెరకెక్కుతోంది. ఏదేమైనా బాహుబలి సీరిస్, త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు రాజమౌళి ఖ్యాతి దేశం ఎల్లలు దాటేసి ప్రపంచ వ్యాప్తంగా వెళ్లిపోయింది. రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడు అయిపోయాడు. త్రివిక్రమ్ ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా ఇంకా టాలీవుడ్ దర్శకుడిగానే ఉన్నాడు. కనీసం పాన్ ఇండియా దర్శకుడు కూడా కాదు.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్‌ను పాన్ ఇండియా కాదు.. ప్రపంచ స్థాయి దర్శకుడిగా మారుస్తామంటూ ఆయన అభిమాన క్యాంప్ ప్రచారం ప్రారంభించింది. త్రివిక్రమ్ క్యాంప్‌కు సన్నిహితంగా ఉండే నిర్మాత సూర్యదేవర నాగవంశీ సవాళ్లు రువ్వుతున్నాడు. ఆయన త్రివిక్రమ్ చేతిలో ఉండే సితార ఎంటర్టైన్‌మెంట్ నిర్మాత, హారిక హాసిని సంస్థ నిర్వాహకుడిగా ఉంటారు. ఆయన నిర్మించిన స్వాతిముత్రం ప్రమోషన్లలో మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తామని.. అది ఎప్పుడు ఎవరితో చేస్తారన్నది టైం వచ్చినప్పుడు చెపుతామని కూడా అన్నారు.
త్రివిక్రమ్ ప్రభాస్, రామ్‌చరణ్ కాంబినేషన్లలో కూడా సినిమాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమాలతో నేషనల్ హీరోలు అయిపోయారు. అందుకే ఆ ఇద్దరు హీరోలతో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. నాగవంశీ చెప్పిన మాటలను బట్టి చూస్తే రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా స్టార్లు అయిన వారినే ఇప్పుడు త్రివిక్రమ్ తన పాన్ ఇండియా సినిమాలకు ఎంచుకుంటున్నట్టే కనిపిస్తోంది.
రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ అవతారంలోకి త్రివిక్రమ్ మారేందుకు రెడీగా ఉన్నాడు. అందుకే ఆయనకు సన్నిహితంగా ఉన్న నాగవంశీ పై వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్, రామ్‌చరణ్ తో త్రివిక్రమ్ సినిమాలు అనేవి రాజమౌళికి త్రివిక్రమ్ విసురుతోన్న పాన్ ఇండియా రేంజ్ సవాళ్లుగానే చూడాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి పాన్ ఇండియా లెవల్లో త్రివిక్రమ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో ? చూడాలి.