దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రపంచం మెచ్చే గొప్ప దర్శకుడు అయిపోయాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి రీసెంట్గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఒక్క అపజయం కూడా లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు రాజమౌళి దెబ్బతో భారతదేశ సినిమా రంగం అంతా టాలీవుడ్ వైపు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలుగు సినిమాను ప్రపంచం మెచ్చుతోంది అంటే అందుకు కారణం కచ్చితంగా రాజమౌళి అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ తో వరుసగా మూడో పాన్ ఇండియా హిట్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
రాజమౌళి స్వతహాగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాడు. వాస్తవంగా రాజమౌళికి తొలి గురువు సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. ఆయన దగ్గర కొద్ది రోజులు పాటు పని నేర్చుకున్న రాజమౌళి ఆ తర్వాత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్ద కథలు రాయడంలో సహాయం చేసేవారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర కూడా కొద్ది రోజులు పని చేశారు. రాఘవేంద్రరావు స్వయంగా నిర్మించిన శాంతి నివాసం సీరియల్ కు రాజమౌళి దర్శకుడు.
ఆ తర్వాత తన గురువు దర్శకత్వ పర్యవేక్షణలోనే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగా ఫోన్ పెట్టాడు. వాస్తవంగా చూస్తే ప్రపంచం మెచ్చే గొప్ప దర్శకుడుగా ఉన్న రాజమౌళి పెద్దగా చదువుకోలేదు. ఆయన ఇంటర్ వరకు మాత్రమే చదివారు. తాను ఇంటర్ చదివానని చెప్పినా… ఎప్పుడు ఆ ఇంటర్ సర్టిఫికెట్ తాను చూడలేదని రాజమౌళి భార్య రమ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా కొవ్వూరులోని దీప్తి స్కూల్లో జరిగింది.
చిన్నప్పుడు రాజమౌళి చాలా అల్లరి చేసేవాడట. అయన చిన్నప్పటి పేరు బంటి. అంత అల్లరి చేసే రాజమౌళి ఆ తర్వాత ఏలూరులో తన మేనత్త ఇంటి దగ్గర ఉంటూ చదువుకున్నారు. 7వ తరగతిలో స్టేట్ ర్యాంక్ రావడంతో అది పేపర్లో ప్రచురితమైంది. ఇది చూసిన రాజమౌళి సన్నిహితులు వాళ్ళ కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ బంటికి మంచి మార్కులు వచ్చాయని ఆనందపడ్డారట.
రాజమౌళి చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడట.. అందరూ బంటీ బంటీ అని పిలిచేవారట.. ఈ విషయాన్ని రాజమౌళి తల్లి రాజనందని సన్నిహితురాలు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత రాజమౌళి ఇంటర్ కూడా ఏలూరులోని సి. ఆర్ రెడ్డి కాలేజీలోనే పూర్తి చేసి వెంటనే కర్ణాటకలోని రాయచూర్ లో కొద్దిరోజుల పాటు ఉన్నారు. అనంతరం వాళ్ళ కుటుంబం చెన్నైకు షిఫ్ట్ అయింది.