సీని రంగం అంటేనే మచ్చలు.. మరకలతో నిండిందనే పేరుంది. మరీ ముఖ్యంగా కొంచెం ఫామ్‌లోకి రాగానే గ్యాసిప్‌లు పెరిగిపోతాయి. హీరో హీరోయిన్లయితే చెప్పడమే కష్టం. వారు ఎవరితో కలిసి ఫొటోలు దిగినా.. వెంటనే ర్యూమర్లు వచ్చేస్తాయి. ఇలాంటివి ఇప్పుడే కాదు.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు సాగిన రోజుల్లోనూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే.. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉండాలని అనుకున్నా.. కష్టమే. కానీ, ఈ విషయంలో అన్నగారు ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలే తీసుకున్నారని అంటారు పరిశీలకులు. ఆయనకు 22 సంవత్సరాలు వచ్చే సరికే సినీరంగంలోకి అడుగు పెట్టారు.
అప్పట్లోనే అంటే.. 26 ఏళ్లకే మంచి ఫామ్‌లో కి వెళ్లిపోయారు.పైగా ఆరడుగుల అందగాడు.. నవమన్మధుడిని పోలిన రూపం. ఏ వేషం వేసినా.. అందులో.. ఇమిడిపోయే తత్వం. వెరసి.. అన్నగారికి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉండేది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది ఆయన వెంట పడేందుకు ఆసక్తి చూపించేవారు. ఈ క్రమంలోనే ఒకసారి సావిత్రికి.. అన్నగారికి ఏదో అవినాభావ సంబందం ఉందంటూ.. తమిళ పేపర్లు రాసేశాయి.
ఈ విషయం అన్నగారికి తెలిసింది. అంతే.. వెంటనే వాటిని ఖండించారు. అయినకూడా.. పదే పదే.. ఆయనపై ఏదో ఒక గ్యాసిప్ వస్తూనే ఉంది. దీంతో అప్పటికే వివాహమైన తనకు ఇలాంటివి ఇబ్బందిగా మారాయి. నిజానికి.. అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, దర్శకులు.. రామారావు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనే పెద్దన మ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఈ వివాదాస్పద.. వార్తలకు ఏదో ఒక చోట అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకున్న అన్నగారు తనదగ్గర డబ్బు లేకపోయినా.. ఒక అగ్ర నిర్మాత నుంచి రూ.లక్ష అప్పు చేసి.. చెన్నైలో ఇల్లు కొన్నారు.
వెంటనే తన సతీమణి బసవ తారకంను అక్కడకు తీసుకు వెళ్లి కాపురం ప్రారంభించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆడంబరాలు.. విందులకు పెద్దగా దూరంగా ఉండే.. అన్నగారు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేశారు. గృహప్రవేశం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. పత్రికాధిపతులను కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా తనపై వస్తున్న రూమర్లు ఏ పత్రికలో వస్తున్నాయో.. చూసి.. ఆ పత్రికా విలేకరులను కూడా ఆహ్వానించారు.
ఇక ఈ ఫంక్షన్‌కు మహానటి సావిత్రిని కూడా పిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రి తాను అనేక సినిమాల్లో నటించామని.. అయినాకూడా.. తనకు ఆమె సోదరి వంటిదని..ఈ రోజు తన ఇంట్లో పాలు పొంగించింది కూడా ఆమేనని చెప్పారు. దీంతో అప్పటి నుంచి రూమర్లకు ఫుల్ స్టాప్ పడిందని.. గుమ్మడి రాసుకున్న పుస్తకంలో పేర్కొన్నారు.