ఇప్పుడు రాజకీయం కులాల మధ్య రొచ్చుగా మారిపోయింది. అధికారం కోసం కులాల కుంపట్లు రెచ్చగొడుతూ కొందరు పబ్బం గడుపు కుంటున్నారు. సినిమా హీరోల అభిమానుల మధ్య ఉన్న వైరాన్ని కొందరు కులాల కుంపట్లు రాజేస్తూ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ అభిమానుల మధ్య మా హీరోయే గొప్ప అన్న ఈగో ఫీలింగ్ గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ రచ్చ వేరుగా ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో పోటీ పడితే బాక్సాఫీస్ వేడెక్కిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు కొందరు ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెడుతూ సినిమాల్లో హీరోలు పోషించిన పాత్రలకు కూడా కులాలు అంట గట్టేస్తున్నారు. వారి పైశాచికత్వం వారిది.
వాస్తవంగా చిరు, బాలయ్య సినిమాలు సంక్రాంతి రేస్‌లో పోటీ పడినప్పుడు ఎవరో ఒకరిది పైచేయిగా నిలుస్తూ వస్తోంది. వంశోద్ధారకుడిపై అన్నయ్యది పైచేయి, స్నేహంకోసంపై సమరసింహారెడ్డి, మృగరాజుపై నరసింహానాయుడుది పైచేయి అయ్యింది. ఇక ఇద్దరూ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తలపడినప్పుడు ఖైదీ నెంబర్ 150కి వసూళ్లు ఎక్కువ వస్తే, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణికి చారిత్రాత్మక సినిమాగా మంచి పేరు వచ్చింది.
అయితే వీరి అభిమానుల మధ్య ఉన్న వార్‌ను పొలిటికల్గా, రకరకాలుగా క్యాష్ చేసుకునేందుకు కొందరు పైశాచిక వాదులు వచ్చే సంక్రాంతికి వస్తోన్న వీరి సినిమాల మధ్యలో దూరిపోయారు. వచ్చే సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి జనవరి 11న, రెండోది జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య తన సినిమాలో అగ్రవర్ణానికి చెందిన రెడ్డి క్యారెక్టర్‌లో నటిస్తుంటే, చిరు వాల్తేరు వీరయ్యలో మత్సకార వర్గానికి చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడంటూ కొందరు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
బాలయ్య తన సినిమాలలో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగా కనిపించిన ప్రతిసారి ఆయన సినిమాయే హిట్ అవుతుందని… ఈ సారి కూడా సంక్రాంతికి బాలయ్యే విన్నర్ అవుతాడని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టులు రాజకీయంగా దుమారం రేపుతుండడంతో ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. కులం, మతం పేరుతో హీరోల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకునే వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. మరి ఇప్పటకి అయినా ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఈ ఫేక్ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.