అన్నగారు ఎన్టీఆర్ మంచి దూకుడుగా ఉన్న సమయం. సినీ ఫీల్డ్‌లో క్షణ తీరిక లేకుండా.. ఆయన దూసుకుపోతున్న టైం. ఇలాంటి సమయంలో గులేబ కావళి కథతో కన్నడంలో ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో మంత్రగత్తె.. పాత్రకు కన్నడంలో పెద్ద స్కోప్ లేదు. కానీ, ఈ కథ అన్నగారి సోదరుడు త్రివి క్రమరావుకు బాగా నచ్చింది. దీంతో ఆయన ఒక రోజు.. ఈ సినిమాపై డిస్కస్ చేశారు. అప్పటికే.. అన్నగారు. ఒక రేంజ్‌లో ఉన్నారు. అయినా కథపై స్టడీ చేయాలని సూచించి ఓకే చెప్పారు. తర్వాత కాలంలో ఒక చక్కటి కథ రెడీ అయింది.
అయితే.. సినిమాలో హీరోయిన్ ఎవరు? అనేది సమస్య. ముఖ్యంగా.. ఒకింత పౌరుషం.. కొంటెతనం.. గంభీరం.. కలగలిసిన నాయకురాలు కావాలి. దీనికోసం.. తొలుత.. త్రివిక్రమరావు.. సావిత్రిని అనుకున్నారట. ఎందుకంటే.. ఈ సినిమాకు నిర్మాతగా ఆయనే వ్యవహరించారు. అయితే.. అన్నగారు అడ్డు చెప్పి.. ఈ లక్షణాలు ఉన్న పిల్లను చూడవోయ్! అంటూ.. సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్టులను ఉచితంగా అందిస్తున్న హాస్యనటుడు రేలంగికి సూచించారట. దీంతో ఆయన జమునను పట్టుకొచ్చారు.
జమునలో క్యారెక్టర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని భావించడంతో పాటు అప్పటికే మంచి ఫాంలో ఉండడంతో అన్నగారు .. ఆమెకు కళ్లు మూసుకుని అవకాశం కల్పించారు. సినిమా అయిపోయింది. భారీ సక్సెస్ వచ్చింది. అయితే.. ఈ సినిమాకు తొలిసారి అన్నగారు.. 100 రోజుల ఫంక్షన్ నిర్వహించారు. దీనిని మద్రాస్‌లోని విజయగార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.
అయితే.. ఈ కార్యక్రమంలో అతిధిగా వచ్చిన ఒకరిద్దరు దర్శకులు.. సినిమా మొత్తంలో అన్నగారి నటన అద్భుతమని కొనియాడారు. విజయ కృష్ణమూర్తి, జోసెఫ్ ఇద్దరు ఈ సినిమాకు సంగీతం అందించారు. వారి ప్రతిభను కూడా కొనియాడారు. అదే సమయంలో ఒక వ్యాఖ్య చేశారు. సినిమా మొత్తంలో జమున క్యారెక్టర్ `తినేసింది!!` అని.. ఇది సభా ముఖంగానే చెప్పారు. అంటే.. ఆమె పాత్రలో లీనమై.. సినిమాకు హైలెట్‌గా నిలిచిందనేది వారి అభిప్రాయం.
సినిమా హిట్ సక్సెస్ వెనుక జమున క్యారెక్టర్ సూపర్ అనే టాక్ వచ్చింది. కట్ చేస్తే ఓ సందర్భంలో.. అన్నగారు.. జమున-రేలంగి-త్రివిక్రమరావు కలుసుకున్నారు. ఆ సమయంలో “జమునను తీసుకుని తప్పు చేశాం.. బ్రదర్.. నాక్యారెక్టర్ చచ్చిపోయింది!“ అని జోక్ చేశారట అన్నగారు. దీంతో అందరూ ఘొల్లున నవ్వేసుకున్నారు. ఇదీ సంగతి!!