మహానటుడు ఎన్టీఆర్, మహానటి సావిత్రి అనేక సినిమాలు కలిసి నటించారు. ప్రతి సినిమా కూడా సూపర్ హిట్స్ సాధించాయి. అప్పట్లో వంద రోజులు అంటే ఇప్పట్లో చెప్పాలంటే ఒక వారం లెక్క. ప్రతి సినిమా కూడా ఏళ్లకు ఏళ్లు ఆడేవి. అది పౌరాణికం అయితే ఏడాది గ్యారెంటీ. ఇక, కుటుంబ కథా సినిమాలు అయితే రెండేళ్లు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితిఈ ఇద్దరి కాంబినేషన్‌ను ఊపేసింది. ఇలాంటి దశలోనే అన్నగారు దర్శకుడిగా మారారు. చాలా సినిమాల్లో అన్నగారితో కలిసి సావిత్రి అన్నగారి డైరెక్షన్‌లోనే పనిచేశారు.
వందల సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ క్రమంలో సావిత్రి కూడా దర్శకురాలిగా అడుగులు వేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, అన్నగారు మాత్రం వద్దు.. ఇది చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం అని తేల్చి చెప్పారు. కావాలంటే నిర్మాతగా ఉండమని సూచించారు. అన్నగారి మాటను పట్టించుకుని అమలు చేసేవారిలో గుమ్మడి తర్వాత సావిత్రి ముందుండేవారు.
దీంతో ఆమె అలానే వ్యవహరించారు. రెండు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. అవి రెండు కూడా తమిళ సినిమాలే. అయితే,ఆ రెండు సినిమాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఆమె మళ్లీ వేషం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సందర్భంగా అన్నగారితో ఆమె ఇదే చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్టీఆర్‌గారూ.. మీరు చెప్పినట్టు చేసి చేతులు కాల్చుకున్నా“ అని అన్నారట. ఎవరి అదృష్టం వారిది! అని అన్నగారు చలోక్తిగా అనేసరికి.. సావిత్రి హర్ట్ అయ్యారు.
మీరు చెప్పినట్టు నేను చేయాలనుకున్నది చేసి ఉంటే బాగుండేదని అనేసి.. తర్వాత సినిమా దర్శకురాలిగా ప్రతిభ చూపించారు. సినిమాలు బాగానే తీశారు. అవి ఆడాయి కూడా. అయితే.. నిర్మాతగా మాత్రం అన్నగారి సూచన పాటించి తను నష్టపోయాననే మాట మాత్రం మిగిలిపోయింది.