Moviesమ‌హేష్ - ఎన్టీఆర్‌తో పోల్చి చిరుపై దారుణ‌మైన ట్రోలింగ్‌... !

మ‌హేష్ – ఎన్టీఆర్‌తో పోల్చి చిరుపై దారుణ‌మైన ట్రోలింగ్‌… !

మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన ఆచార్య సినిమా చేశారో కానీ ఆ సినిమా డిజాస్టర్ తాలూకు బాధ చిరంజీవిని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య పై వస్తున్న ట్రోలింగ్స్ ఇప్పటికీ ఆగటం లేదు. ఆచార్య రిలీజ్‌కు ముందు దర్శకుడు కొరటాల శివను చిరంజీవి ఎంతలా పొగిడారో చూశాం. కానీ రిలీజ్ అయ్యి ఆచార్య డిజాస్టర్ అయ్యాక ఆ సినిమా పరాజయానికి మొత్తం బాధ్యత కొరటాల శివదే అన్నట్టుగా చిరంజీవి పలు సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. చిరంజీవిది 150 సినిమాల అనుభవం. ఆయన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి.

అయితే ఆయన గతంలో ఎప్పుడు ఇంతలా ఒక డైరెక్టర్ ను టార్గెట్ చేసిన సందర్భాలు లేవు. ఆచార్య ప్లాప్ అయింది. అంతమాత్రాన కొరటాల శివను పదే పదే టార్గెట్ చేస్తూ రావడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు కొరటాలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా చిరు విమర్శలు చేయడం చాలామందికి నచ్చ లేదు. తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో సైతం డైరెక్టర్ ఏది చెబితే అదే తాము చేశామని చిరు చెప్పారు. అంటే సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ చిరంజీవి తీసుకుని.. ప్లాప్ అయితే మాత్రం దర్శకుడు ఖాతాలో తోసేస్తారా ? అని చిరు యాంటీ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు.

ఒక సందర్భంలో మహేష్ బాబు చెప్పిన మాటలను కూడా ఇప్పుడు చిరు చెప్పిన మాటలతో కంపేరిజన్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక సినిమా ప్లాప్ అయితే అందుకు ప్రధాన బాధ్యత తనదే అని మహేష్ చెప్పాడు.. ఆ కథను ఓకే చేసింది తానే కాబట్టి.. తాను నో చెప్పి ఉంటే ఆ సినిమా ప్లాప్ అయ్యేది కాదు కదా అందుకని సినిమా ప్లాప్ అయినందుకు తనదే ప్రధాన బాధ్యత అని… హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని మహేష్ బాబు చెప్పాడు.

మరో సందర్భంలో మహేష్ బాబు గురించి దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ దూకుడు సినిమా అంత పెద్ద హిట్ అవ్వటం ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీనువైట్లకి చెందుతుందని… అతడు చెప్పినట్టే తాను చేశానని మహేష్ అన్నాడని… అలాగే బిజినెస్ మాన్ విషయంలోనూ క్రెడిట్ అంతా పూరి జగన్నాథ్ కే ఇచ్చాడని… మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం ఇదే అని దాసరి కొనియాడిన వీడియోను కూడా ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తూ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజమౌళి గతంలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌కు ప్లాప్‌లు ఇచ్చిన దర్శకుల గురించి కూడా అతడు ఎప్పుడు ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడలేదని… ఎవరిని పల్లెత్తు మాట అనలేదని’ చెప్పిన మాటను కూడా ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తూ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆచార్య‌ విషయంలో పదేపదే చిరంజీవి కొరటాలను టార్గెట్ చేస్తూ లేనిపోని విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news