ఈ హెడ్డింగ్ చూస్తే చాలా ఆసక్తికరంగానూ.. అదే సమయంలో చాలా కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తోంది కదూ. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో మొదలైన అచ్చ తెలుగు ఓటీటీకి వచ్చిన ఆదరణను అన్‌స్టాపబుల్ షోకు ముందు, తర్వాత అని విభజించి చూడొచ్చు. కేవలం ఈ షో చూసేందుకు ఆహా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు లక్షలమంది ఉన్నారు. అందులో మెజారిటీ బాలయ్య అభిమానులే అయినా.. న్యూట్రల్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆ షో బాగా ఆకర్షించింది.
వేదికల మీద, బయట మాట్లాడేటపుడు కొంచెం తడబడే బాలయ్యతో టాక్ షో ఏంటి అన్న వాళ్లంతా.. ఈ షో చూసి ముక్కున వేలేసుకున్నారు. చక్కటి వాక్చాతుర్యంతో, హాస్య చతురతతో, తనకే సొంతమైన ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్‌తో బాలయ్య ఈ షోను నడిపించిన తీరుకు ఆయన అభిమానులు కాని వాళ్లు కూడా ఫిదా అయిపోయారు.ఈ షో వల్లే ఆహా నిలబడుతోంది, ఎదుగుతోంది అంటే అతిశయోక్తి ఏమీ లేదు.
రెండో సీజన్‌ను నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా ఒక బ్యాంగ్ బ్యాంగ్ ఎపిసోడ్‌తో మొదలుపెట్టిన బాలయ్య.. ఈ షోను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. ఈ ఎపిసోడ్‌కు వచ్చిన ఆదరణ, ఆహాకు మరింత పెరిగిన సబ్‌స్క్రిప్షన్లు చూసి ఈ ఓటీటీ అధినేత అల్లు అరవింద్ చాలా సంతోషంగా ఉన్నారట.
ఈ నేపథ్యంలోనే బాలయ్యకు ఇంతకుముందు అనుకున్న దానికంటే ఎక్కువ పారితోషకం ఇవ్వాలని భావించారట. ఇదే మాట బాలయ్య దగ్గర చెబితే.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. తనకు అధిక పారితోషకం వద్దని, అది నా విలువలకు విరుద్ధం అని చెప్పేశారట. అయితే, అల్లు అరవింద్… దీనిపై కాస్త మదనపడ్డారట. అదే సమయంలో బాలయ్య పెద్ద మనసు అల్లు అరవింద్ ను ఆకట్టుకుందట.
తనకు వచ్చే డబ్బునే బాలయ్య వద్దంటే ఆ డబ్బు మన వద్ద ఉంచుకోవడం తన మనసుకు మంచిగా అనిపించలేదట. అందుకే తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడని ఇండస్ట్రీలో పేరు అల్లు అరవింద్.. అనూహ్యమైన డెసిషన్ తీసుకున్నారట. బాలయ్యకు ఎంతయితే రెమ్యునరేషన్ పెంచాలి అనుకున్నారో ఆ మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.
ఈ విషయం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏదేమైనా బాలయ్యదే షాకింగ్ డిసెషన్ అంటే… అల్లు అరవింద్ అంత కంటే తెలివైన మంచి నిర్ణయం తీసుకున్నారే… ఇద్దరూ ఇద్దరే అని ఆహా ఆఫీస్ లా టాక్ అంట. ఈ చర్యతో బాలయ్య, అరవింద్ ఇద్దరూ జనాల మనసులు గెలవబోతున్నారనడంలో సందేహం లేదు.