నందమూరి నటసింహం బాలకృష్ణకు సింహా అన్న టైటిల్ ఎలా కలిసి వచ్చిందో పోలీస్ క్యారెక్టర్లు కూడా అలాగే కలిసి వచ్చాయి. బాలయ్యకు కలిసొచ్చిన సింహా సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూనే ఆయన తాజా సినిమాకు సైతం వీరసింహా రెడ్డి అన్న టైటిల్ పెట్టారు. ఇక బాలయ్య గతంలో రౌడీ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, లక్ష్మీనరసింహా లాంటి సినిమాల్లో పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. రౌడీఇన్‌స్పెక్టర్, లక్ష్మీ నరసింహా లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
బాలయ్యకు నరసింహానాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చెన్నకేశవరెడ్డి మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత హిట్ పడలేదు. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సామీ సినిమా ఆధారంగా తెలుగులో లక్ష్మీనరసింహా సినిమా తీశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. జయంత్ దర్శకుడు. ఆశిన్ హీరోయిన్. బాలయ్య యాక్షన్‌కు తోడు, డైలాగులు, ఆశిన్ అందాలు, కృష్ణ భగవాన్ కామెడీ, మణిశర్మ పాటలు, ప్రకాష్‌రాజ్ విలనిజం అన్నీ కలిసి ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి.
2004 సంక్రాంతి కానుకగా చిరంజీవి అంజి, ప్రభాస్ వర్షం సినిమాలకు పోటీగా వచ్చి మరీ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాను తెలుగులో ఫైనల్ కాపీ ఎడిట్ చేశాక సినిమా రన్ టైం 3 గంటల 18 నిమిషాలు అంటే 198 నిమిషాలు వచ్చిందట. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిట్ చేశాక వచ్చిన రన్ టైం ఇది. ఆయన కూడా సినిమా సీన్లు బాగుండడంతో అంతకు మించి కుదించలేని పరిస్థితి.
ఫైనల్ కాపీ చూసిన దర్శక, నిర్మాతలు కూడా అలాగే ఉంచేయమని చెప్పారట. అందులోనూ జయంత్ సినిమాలు అంటే చాలా లెన్దీగా ఉంటాయని మార్తాండ్ కె. వెంకటేష్ ముందే ఫిక్స్ అయిపోయారు. అయితే అంత రన్ టైం ఉంటే సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని సినిమాకు పనిచేసిన కొందరు ముందే హెచ్చరించారట. అయితే బాలయ్యకు కథపై నమ్మకం ఉంది. అటు దర్శకుడు జయంత్ కూడా సినిమాను అనవసరంగా కట్ చేసేందుకు ఒప్పుకోలేదు.
తీరా సినిమా మూడు పెద్ద సినిమాల మధ్యలో పోటీగా రిలీజ్ అయ్యి కూడా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని.. అంత సేపు థియేటర్లలో సినిమాను చూడడం పెద్ద బోరింగ్ అని ముందు నుంచి ప్రచారం చేసిన వాళ్ల గూబ గుయ్‌మనేలా బాలయ్య ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.