తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటకీ నిలిచిపోయే సినిమాల్లో దానవీరశూర కర్ణ ఒకటి. ఎన్టీఆర్‌ను అప్పటి వరకు రాముడు, కృష్ణుడిగా ప్రేక్షకులు ఊహించుకునేవారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడితో పాటు కర్ణుడిగాను, ధుర్యోధనుడిగాను అసామాన్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించేశారు. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఈ సినిమా డైలాగులు ఇప్పటకీ తెలుగు ప్రజల మదిలో అలానే నిలిచిపోయాయి. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు కింద తెలుసుకుందాం.
1- ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.
2 – ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితమే అనాలి. అప్పట్లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ స్వయంగా నిర్మాతగా నిర్మించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ మూడు పాత్రల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా ఇలాంటి సాహసం చేసి హిట్ కొట్టలేదు. ఇక కొట్టబోరు కూడా..!
3 – ఈ సినిమాలో ఎన్టీఆర్ కర్ణుడిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించారు. మొత్తం సినిమా అప్పట్లో 25 రీల్స్ అంటే 4 గంటల 17 నిమిషాల నిడివితో ఉండేది. దాదాపు 4 గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్ర తెరమీద కనిపిస్తూనే ఉంటుంది.
4 – భారతీయ సినిమాలలో అత్యంత పొడవైన సినిమాగా కర్ణ రికార్డులు క్రియేట్ చేసింది. ఇదో రికార్డు. రాజ్‌కపూర్ హిందీ సినిమా మేరా నామ్ జోకర్ ముందుగా 4 గంటల 24 నిమిషాలు. ఆ తర్వాత అందులో 40 నిమిషాలు ట్రిమ్ చేయడంతో కర్ణ భారతీయ సినిమాల్లోనే పొడవైన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
5 – ఇంత పెద్ద సినిమా కేవలం 43 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యింది.
6 – కృష్ణ హీరోగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో మహాభారత కథ ఆధారంగానే తెరకెక్కిన కురుక్షేత్రం సినిమా, కర్ణ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రెండూ మహాభారత కథ ఆధారంగా వస్తుండడంతో అప్పట్లో ప్రేక్షకుల్లో కూడా ఏది హిట్ అవుతుందన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్టీఆర్ కర్ణ సినిమా ముందు కురుక్షేత్ర చేతులు ఎత్తేసి ప్లాప్ అయ్యింది.
7 – ఈ సినిమాకు మాటలు రాసిన కొండవీటి వెంకటకవికి ఇదే మొదటి సినిమా. ఆయన నాస్తికుడు. కులమత వ్యతిరేకి. ఈ సినిమాకు మాటలు రాసేందుకు ముందుగా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. ఈ సినిమా డైలాగులు ఇన్నేళ్లకు కూడా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించేస్తాయి.
8 – ఈ సినిమాలో అర్జనుడిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యుడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. వీరిద్దరు ఎన్టీఆర్‌కు కుమారులు. బాలయ్య, హరికృష్ణ, ఎన్టీఆర్ ముగ్గురూ కలిసి నటించిన చివరి చిత్రం ఇది. అంతకు ముందు వీరు ముగ్గురు బివి. సుబ్బారావు దర్శకత్వంలో రామ్ రహీమ్ సినిమాలో నటించారు.
9 – సినిమాను ఆఘమేఘాల మీద పూర్తి చేసి అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ పంతం పట్టారు. దీంతో బాలయ్య, హరికృష్ణ ఇద్దరూ కూడా ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు కూడా సహకరించారు.
10 – బాలయ్య, హరికృష్ణకు ఎన్టీఆర్ స్వయంగా మేకప్ వేసిన సినిమా ఇదే.
11 – సీనియర్ నటుడు చలపతిరావు ఈ సినిమాలో ఏకంగా ఐదుపాత్రల్లో కనిపిస్తారు. అందులో జరాసంద, అతిరథ, ఇంద్ర.. మిగిలిన రెండు గెస్ట్ రోల్స్.
12 – ఎన్టీఆర్ నటించిన 248వ సినిమా ఇది.