గురువుల పాత్రల్లో అనేక మంది సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు.. నుంచి నేటి తరం .. చిరంజీవి వరకు కూడా పలు చిత్రాల్లో మాస్టర్ పాత్రలు పోషించారు. అయితే.. అన్నగారికి వచ్చిన పేరు మాత్రం ఎవరికీ రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ.. గురువు పాత్రలో అన్నగారినే చూసుకుంటారు. అదే బడిపంతులు సినిమా. అప్పటికి అన్నగారు.. హీరోగా.. దూసుకుపోతున్న రోజులు. అయితే.. దుక్కిపాటి మధుసూదనరావు.. అభ్యర్థనతో బడిపంతులు సినిమాను ఒప్పుకొన్నారు.
ఈ సినిమాలో అన్నగారు నడివయస్కుడి పాత్రలో అందునా విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిగా నటించారు. ఆయనకు కుమార్తెగా శ్రీదేవి నటించింది. ఇక, అంజలీదేవి భార్యగా మెప్పించారు. అయితే.. మంచి హీరోయిజంతో కొనసాగుతున్న సమయంలో కేవలం క్యారెక్టర్ పాత్రకు ప్రాధాన్యం ఉన్న ఈ బడి పంతులు సినిమాలో నటించడంపై అప్పట్లో అన్నగారు కొంత తటపటాయించారు. అయినప్పటికీ.. దర్శకుడిపై ఉన్న నమ్మకం ఆయనను నడిపించింది.
అదేవిధంగా కథలోనూ బలం ఉండడం.. సమాజానికి ఒక సందేశం ఇచ్చే పాత్ర కావడంతో అన్నగారు ఒప్పుకొన్నారు. ఇక, సినిమా విడుదలైన తర్వాత.. రెండు వారాల పాటు కలెక్షన్లు లేవంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందు ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ అంటేనే స్ట్రాంగ్ హీరోయిజం ఉంటుంది. అసలు ఈ రోల్లో ఎన్టీఆర్‌ను జనాలు ఊహించుకుంటారా ? అన్న సందేహాలుకూడా వచ్చాయి.
తర్వాత తర్వాత.. పుంజుకున్న ఈ సినిమా.. విజయవాడలోని అప్పటి విజయటాకీస్‌లో ఏకంగా ఏడాదిపాటు దిగ్విజయంగా ఆడింది. ఇక, ఉత్తమ గురువు పాత్రలో అన్నగారు ఒదిగిపోయినా.. ఈ సినిమాకు కథా పరంగా నంది అవార్డు దక్కిందే తప్ప.. అన్నగారికి ఎలాంటి అవార్డులు లభించకపోవడం గమనార్హం.