ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. మల్టీ స్టారర్ మూవీల హవా జోరుగా సాగుతోంది. అగ్రహీరోలు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాలు హిట్లు కూడా కొడుతున్నాయి. టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ విషయంలో ముందుడుగు వేసి మహేష్, పవన్, రామ్, వరుణ్‌తేజ్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. ఇక త్రిబుల్ ఆర్‌తో ఏకంగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించి పెద్ద సంచలనం రేపారు. అయితే 1990వ దశకంలో మూవీలను చూస్తే..ఈ తరహా పరిస్థితి కని పించడం లేదనే టాక్ ఉంది. మల్టీస్టారర్ మూవీలు వస్తే.. హీరోల స్టార్ డమ్ తగ్గుతుందనో.. లేక.. మరే కారణమో తెలియదు కానీ.. అప్పట్లో మల్టీ స్టారర్ మూవీలకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.
అయితే ఆ దశకంలో స్టార్ హీరోలు కలిసి నటిస్తే కథపరంగా ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం దర్శకులకు కూడా కత్తమీద సాములా ఉండేది. ఆ హీరోల అభిమానులు కూడా ఎవ్వరి క్యారెక్టర్ తగ్గినా పెద్ద రచ్చ చేసేవారు. అందుకే అంత రిస్క్ దర్శకులు, హీరోలు చేయలేదు. సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసినా కొన్ని సందర్భాల్లో మరో హీరోతో కలిసి తెర పంచుకునే విషయంలో కాస్త జంకేవారట.
అలాగని అన్నగారు మల్టీ స్టారర్ మూవీలకు వ్యతిరేకం అని చెప్పలేం. ఎందుకంటే.. ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాల్లో.. అప్పటి అగ్ర హీరోలతో కలిసి ఆయన నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి.. భూకైలాస్, మాయాబజార్ వంటి సినిమాలు చేశారు. అదేవిధంగా శోభన్‌బాబు, కృష్ణలతోనూ కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. అయితే.. ఏ సినిమా ఒప్పుకోవాలన్నా.. అన్నగారికి జంకు ఉండేదని చెబుతారు.
మల్టీ స్టారర్ మూవీలు హిట్ కొట్టినా.. ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై.. నిర్మాత, దర్శకుల మధ్య తర్జన భర్జన కొనసాగేది. అందుకే.. ఈ విషయంలో అన్నగారు కొంత వరకు.. వెనక్కి తగ్గేవారు. పైగా.. హీరోల రెమ్యునరేషన్.. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా ఎక్కువగానే ఉండేది. దీంతో నిర్మాతలు కూడా మల్టీస్టారర్ మూవీలు చేస్తే.. కష్టాలు.. నష్టాలు వస్తాయేమోనని జంకేవారు.
దీంతో ఇండివిడ్యువల్‌గా నిర్మాతలు సినిమాలు చేయాల్సి వస్తే.. మల్టీ స్టారర్ వైపు మొగ్గు చూపేవారుకాదు. ఎన్టీఆర్ కూడా ఏదో ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయాలనే దానికన్నా కథ డిమాండ్ చేసినా, ఇద్దరి పాత్రలు సమానంగా ఉన్నా, పౌరాణిక సినిమాలు అయినా మల్టీస్టారర్‌గా చేసేందుకు ఎవ్వరూ అడిగినా కాదనేవారు కాదు.