టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కృష్ణంరాజు తన నటనతో తెలుగు సినీ ప్రేమికులను ఎంతగానో అలరించారు. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో ఆయన నటించారు. కృష్ణంరాజు సాంఘికం, జానపదం, పౌరాణికం ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయేవారు. బొబ్బిలి బ్రహ్మన్న, భక్తకన్నప్ప, పల్నాటి పౌరుషం ఇలా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సినిమాలలో కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు.
జయసుధ, జయప్రద, శ్రీదేవి, వాణిశ్రీ ఇలా అప్పట్లో పేరున్న నటీమణులు అందరితోనూ ఆయన నటించారు. కృష్ణంరాజుతో ఎంతో మంది హీరోయిన్లు నటించినా ఆయనకు మాత్రం ఒక హీరోయిన్ అంటే చాలా మక్కువ. ఈ విషయాన్ని ఆయనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో బయటపెట్టారు. తనతో ఎంతోమంది హీరోయిన్లు నటించినా సహజనటి జయసుధ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆమె అంటే తనకు ఎందుకు ఇష్టమో కూడా కృష్ణంరాజు కారణం చెప్పారు.
జయసుధ తన కాంబినేషన్లో 70కు పైగా సినిమాలు వచ్చాయని.. ఏ సీన్లో అయినా తామిద్దరం పోటీపడి సీను పండించేలా నటించామని చెప్పారు. ఆ సీన్ రక్తి కట్టించే క్రమంలో జయసుధ తాను కలిసి ఒకరికొకరు కోపరేట్ చేసుకుంటూ ఆ సీన్లో జీవించే వాళ్లమని ఆయన తెలిపారు. జయసుధ తర్వాత తనకు బాగా నచ్చిన హీరోయిన్లలో శ్రీదేవి పేరు రెండో పేరుగా చెప్పారు. కృష్ణంరాజు – శ్రీదేవి తన కాంబినేషన్లో ఏడు, ఎనిమిది సినిమాలు వచ్చాయని తెలిపారు.
అయితే శ్రీదేవితో కూడా ఒక్కో సీన్లో నటించే సమయంలో శ్రీదేవి తనతో పోటీపడి నటించకపోతే.. తాను తన స్థాయికి కాస్త తగ్గి ఆ సీన్ చేయాల్సి వచ్చేదని.. కానీ జయసుధ విషయంలో తనకు ఎప్పుడూ అలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని కృష్ణంరాజు చెప్పారు. అలా నటన పరంగా తనతో పోటీపడి నటించే విషయంలో జయసుధ అంటే తనకు ఎంతో ఇష్టమని కృష్ణంరాజు తన మనసులో ఉన్న అభిమానం బయటపెట్టారు.