ఆ ఫ్యామిలీ హీరోలతో నటిస్తే కెరీర్ మటాషేనా..? అంటూ ఇప్పుడు కొందరు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ హీరోలెవరో కాదు..మంచు ఫ్యామిలీ వారేనట. వారి సరసన హీరోయిన్‌గా నటిస్తే ఆ హీరోయిన్‌కి కెరీర్ ఉండదనేది కొందరు చెప్పుకుంటున్న మాట. మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలలో హీరోయిన్‌గా పార్వతీ మెల్టన్, లావణ్య త్రిపాఠి, హన్షిక మొత్వానీ లాంటి వారున్నారు. వీరు ఇప్పుడు తెలుగులో పెద్దగా రాణించడం లేదు.
అయితే, పార్వతీ మెల్టన్ కొన్ని సినిమాలు చేసినా ఆమె హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఆ లెక్కన చూస్తే మంచు విష్ణు సరసన నటించడం వల్లే తన కెరీర్ ఢమాల్ అయిందని అనుకోలేము. లావణ్య త్రిపాఠి కెరీర్ చూస్తే విష్ణు సరసన కెరీర్ ప్రారంభంలో దూసుకెళ్తా లాంటి హిట్ సినిమాలో నటించింది. ఆమె తెలుగులో అందుకున్న హిట్స్‌లో మంచు విష్ణు సినిమా కూడా ఉంది. నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయన, నాని సరసన భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది.
కానీ, ఆ తర్వాత లావణ్య కెరీర్ మరో మలుపు తిరిగి సక్సెస్‌లు అందుకోలేకపోయింది. హన్షిక కూడా అంతే. మిగతా హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంది. ఇక షీలా, తమన్నా, రెజీనా లాంటి వారు మంచు మనోజ్ సరసన హీరోయిన్స్‌గా నటించారు. అయితే, షీలా అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ సరసన నటించి హిట్స్ అందుకున్నా ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైపోయింది. తమన్నా మొదటి సినిమా మంచు మనోజ్‌తోనే చేసింది. ఆ సినిమా ఫ్లాపైనా హ్యాపీడేస్, రచ్చ సినిమాలతో పాపులర్ అయి ఇంకా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.
ఇక రెజీనా అంతకముందు చాలామంది హీరోలతో చేసి హిట్స్ అందుకుంది. మధ్యలో ఒకే ఒక్క సినిమా మంచు మనోజ్‌తో చేసింది. ఈ సినిమా ఫ్లాపైనా ఆ ప్రభావం పెద్దగా రెజీనా మీద పడలేదు. ప్రస్తుతం నివేథా థామస్ తో కలిసి శాకిని డాకిని సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ లెక్కన చూస్తే మంచు ఫ్యామిలీ హీరోలతో నటిస్తే హీరోయిన్‌కి లైఫ్ ఉండదనే మాట కొంత వరకు నిజం అయితే…. కొంత వరకు రాంగ్ అని అర్థమవుతోంది.