కరోనా తర్వాత కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను నందమూరి హీరోలు ఆదుకున్నారనే చెప్పాలి. ఎనిమిది నెలల తేడాలో ముగ్గురు నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చి మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. డిసెంబర్లో `అఖండతో` బాలయ్య అఖండ గర్జన మోగించేశారు. ఆ తర్వాత మార్చ్ లో ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇక వాళ్ళిద్దరి హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ ఆగస్టులో `బింబిసారా` సినిమాతో తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన `బింబిసార` సినిమా కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. దీనికి తోడు కళ్యాణ్ రామ్ నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓవరాల్ గా కళ్యాణ్‌రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా `బింబిసార` రికార్డుల్లో నిలిచిపోయింది. రు. 65 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన `బింబిసారా` 35 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని సెంటర్లలో రన్ అవుతోంది.
కళ్యాణ్ రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇలా ఏడు, ఎనిమిది నెలల గ్యాప్లో ముగ్గురు నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పటికే `అఖండ`, `త్రిబుల్ ఆర్` సినిమాలు వెండితెరతో పాటు బుల్లితెర మీద కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే `బింబిసార` సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.
వెండితెరపై `బింబిసార` సినిమా చూడని సినీ ప్రేమికులు అందరూ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ? ఎప్పుడు చూద్దామా ? అని ఆసక్తితో ఉన్నారు. తాజాగ `బింబిసార` ఓటిటీ హక్కులు సొంతం చేసుకున్న జీ 5 ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 7 నుంచి `బింబిసార` జి 5 లో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఓటీటీలో `త్రిబుల్ ఆర్`, `అఖండ` సినిమాలను పదేపదే ఎంజాయ్ చేస్తున్న నందమూరి అభిమానులు ఇప్పుడు మరోసారి ‘ బింబిసార ‘ సినిమాతో దసరా పండుగ చేసుకోమన్నారు.