Movies' ఒక్క‌డు ' సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇదే... ఎలా...

‘ ఒక్క‌డు ‘ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇదే… ఎలా మారిందంటే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా ఒక్కడు. 2003 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహేష్ కి జోడిగా భూమిక హీరోయిన్‌గా నటించ‌గా… సుమంత్ ఆర్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ నాగ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన ఒక్కడు ఏకంగా 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడి తెలుగు సినిమా చరిత్ర రికార్డులను చాలావరకు చెరిపేసింది. ఒక్కడు ఇలా కనివినీ ఎరుగ‌ని రీతిలో విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు.

ఈ సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి రాయడం ప్రారంభించారు. గుణశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ ఛార్మినార్ దగ్గరికి వచ్చి టీ తాగి వెళుతూ ఉండేవారు. ఆ సమయంలో మధ్యలో ఛార్మినార్.. రెండు గ్యాంగుల మధ్య వార్‌ నేపథ్యంలో కథ రాసుకుంటే బాగుంటుందన్న‌ ఆలోచనకు వచ్చారు. రాజకుమారుడు సినిమా షూటింగ్ నడుస్తుండగా అదే వైజయంతి మూవీస్ బ్యానర్ లో గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారు.

ఆ సమయంలో మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయంతో గుణశేఖర్ ఈ కథను మహేష్‌కు చెప్పారు. మహేష్‌కు వెంటనే కథ నచ్చేసింది. అయితే ఆ తర్వాత గుణశేఖర్‌కు చిరంజీవితో చేసిన మృగరాజు రూపంలో పెద్ద డిజాస్టర్ ఎదురైంది. అయినా మహేష్ బాబు మాత్రం గుణశేఖర్ పై ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ముందుగా ఈ కథను ఉషాకిరణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించాలని అనుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఛార్మినార్ సెట్టు కూడా వేస్తానని గుణశేఖర్ కు హామీ ఇచ్చారు.

ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టులోకి నిర్మాతగా ఎమ్మెస్ రెడ్డి వచ్చారు. చివరకు ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో మహేష్ స్వయంగా ఎమ్మెస్ రాజు బ్యానర్ లో మనం ఈ సినిమా చేస్తున్నామని గుణశేఖర్ కు చెప్పారు. ఎంఎస్ రాజుకు కూడా గుణశేఖర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ రోజుల్లోనే రెండు కోట్ల రూపాయలతో ఛార్మినార్ సెట్ వేశారు. అత్యంత భారీ బడ్జెట్ తో 2002లోనే 14 కోట్ల రూపాయలతో ఒక్కడు సినిమా తెరకెక్కింది. సినిమా తొలి రోజు తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఆ రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి మహేష్ బాబును టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ ను చేసింది. అయితే ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అన్న టైటిల్ పెట్టాలని అనుకున్నారు. అయితే అప్పటికే ఆ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో గుణశేఖర్ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆ తర్వాత క‌బ‌డ్డీ అన్న పేరు అనుకున్నారు. చివరకు గుణశేఖర్ ఒక్కడు అన్న టైటిల్ చెప్పిన వెంటనే మహేష్ ఓకే చెప్పేశారు. అలా ఒక్కడు సినిమా టైటిల్ పుట్టి మహేష్ కెరీర్ ను మార్చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news