సినీ రంగంలో అన్నగారు.. ఎన్టీఆర్ సాధించని మైలు రాయి అంటూ ఏదీ లేదు. ఆయన వేయని వేషం లేదు.. ఆయన ధరించని పాత్రలేదు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన ఎదురులేని హీరోగా రికార్డు సృష్టించారు. అదే సమయంలో ఆయన పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తొలి దశలో అన్నగారు తమిళ చిత్రాల్లో నటించారు. తర్వాత.. కన్నడ అగ్రహీరో రాజ్‌కుమార్ చేసిన విజ్ఞప్తితో అన్నగారు కన్నడ సినిమాల్లోనూ నటించారు.
ఇలా తెలుగులోనే కాకుండా.. రెండు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అన్నగారు నటించారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ చేసిన పౌరాణిక సినిమాలు చెన్నై, బెంగళూరులో కూడా 100 , 200 రోజులు ఆడేవి. అప్పట్లో అదో సంచలనం. ఆ అరుదైన ఘనత ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కింది. ఈ క్రమంలో యువ హీరోగా బాలీవుడ్‌లో అబితాబ్‌బచ్చన్ ఎదుగుతున్నారు. తరచుగా.. జరిగే.. సినిమా ఫెస్టివల్స్‌కు అన్నగారు కూడా హాజరు అయ్యేవారు.
ఈ క్రమంలోనే అమితాబ్.. అన్నగారికి బాలీవుడ్‌లోనూ నటించాలని.. కోరారు. అయితే.. ఈ విన్నపాన్ని అన్నగారు.. తిరస్కరించారు కానీ, పట్టువీడని అమితాబ్.. అన్నగారిని పదే పదే కోరారు. దీంతో ఒక సినిమాకు అన్నగారు సైన్ చేశారు. కానీ.. ఈ సినిమా నిర్మాత హఠాన్మరణంతో సినిమా పట్టాలెక్కలేదు. ఇక, ఆ తర్వాత.. అన్నగారు హిందీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడలేదు. తనకు ప్రాంతీయ భాషల పట్ల మక్కువ ఎక్కువని చెప్పే అన్నగారు.. ప్రధమ ప్రాధాన్యం తెలుగుకే ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన నిర్విరామంగా తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు.. తెలుగులోనే భిన్నమైన సినిమాలు తీసేందుకు.. అన్నగారు ప్రోత్సహించారనే టాక్ కూడా ఉంది. మొత్తంగా.. అన్నగారు.. బాలీవుడ్ నుంచి అవకాశం వచ్చినా.. సున్నితంగా తిరస్కరించి తెలుగుపై తన అభిమానాన్ని చాటుకున్నారనడంలో సందేహం లేదు.