అమ్మ రాజశేఖర్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన కొరియోగ్రాఫ్ తో ఒక ఊపు ఊపేసిన మాస్ డ్యాన్స్ డైరెక్టర్. ఒకప్పుడు అమ్మ రాజశేఖర్ స్టెప్పులకు అదిరిపోయే క్రేజ్ ఉండేది. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసిన ఘనత అమ్మ రాజశేఖర్ మాస్టర్ కే దక్కుతుంది. లారెన్స్ బాటలోనే కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన అమ్మ రాజశేఖర్ గోపీచంద్‌తో రణం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. తొలి సినిమా హిట్ అవ్వడంతో అమ్మ రాజశేఖర్‌కు డైరెక్టర్ గా కూడా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు ఆసక్తి చూపారు.
ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో చేసిన ఖతర్నాక్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా కథ బాగున్నా రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ కావడంతో ప్లాప్ అయిందని అమ్మ రాజశేఖర్ ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు. అయితే రణం సినిమాలో గోపీచంద్‌ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన తీరుకు చాలామంది హీరోలు ఫిదా అయిపోయారు. అమ్మ రాజశేఖర్ రణం సినిమా కథను ముందుగా జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పారు. ఎన్టీఆర్‌కు కూడా కథ బాగా నచ్చింది.
అయితే ఆ సినిమాలో హీరో విలన్ కింద కూర్చోవాల్సి వస్తుంది. అప్పటికే తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌కు ఆ కథ సూట్ కాదని… అమ్మ రాజశేఖర్ గోపీచంద్ తో తెరకెక్కించి హిట్ కొట్టారు. అదే సమయంలో అమ్మ రాజశేఖర్ నటి సింహం బాలకృష్ణకు కూడా ఓ పవర్ఫుల్ మాస్ యాక్షన్ కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. బాలయ్యకు ఆ మాస్ కథ బాగా ఎక్కేసింది. బాలయ్య – అమ్మ రాజశేఖర్ సినిమా సెట్స్ మీదకు వెళుతున్న టైంలో సడన్‌గా ఈ సినిమాకు బ్రేక్ పడింది. శ్రీకాంత్‌తో మహాత్మ సినిమా నిర్మించిన నిర్మాత ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు.
త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందనుకుంటున్న సమయంలో నిర్మాత సోదరుడు హఠాన్మరణంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయింది. బాలయ్యతో సినిమా చేసి ఉంటే తన కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని అమ్మ రాజశేఖర్ తెలిపారు. అలాగే చిరంజీవి హీరోగా ఒక పోలీస్ కథను కూడా తాను రెడీ చేసుకున్నానని… అది కూడా కుదరలేదని తెలిపారు. ఇక అమ్మ రాజశేఖర్ తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన మళ్ళీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.