మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత సైరాతో మెప్పించాడు. ఆ తర్వాత కరోనా కాలంలో కాస్త గ్యాప్ వచ్చినా ఇప్పుడు వరుస పెట్టి కుర్ర హీరోలకే షాకుల మీద షాకులు ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ సమ్మర్‌లో తన తనయుడు రాంచరణ్‌తో కలిసి నటించిన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వచ్చే మూడు పండగలకు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ముందుగా ఈ దసరాకు గాడ్‌ఫాథర్ సినిమా వస్తోంది. వచ్చే సంక్రాంతికి బాబి దర్శకత్వంలో నటిస్తోన్న వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక వచ్చే ఉగాదికి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న వేదాళం రీమేక్ భోళాశంకర్ రిలీజ్ అవుతోంది. అంటే యేడాది వ్యవధిలోనే చిరు ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అంటే మామూలు విజువల్ ఫీస్ట్ కాదు.
ఇక చిరు తన కెరీర్‌లో ఇప్పటికే 151 సినిమాలు చేశాడు. 1980వ దశకంలో అయితే యేడాదికే ఆరేడు సినిమాలతో చిరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిరు నటించిన విజేత, అడవిదొంగ సినిమాలు అయితే నెల రోజుల తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందులో అడవిదొంగ సూపర్ బ్లాక్‌బస్టర్. ఇంకా చెప్పాలంటే చిరంజీవిని తిరుగులేని కమర్షియల్ హీరోను చేసింది.
అడవిదొంగ సినిమాలో చిరంజీవి నటన, డ్యాన్సులకు అప్పటి తెలుగు జనాలు పిచ్చెక్కిపోయారు. అప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా ? అన్న చర్చలు నడుస్తోన్న టైంలో వాళ్లందరి ప్రశ్నలకు చిరంజీవి తన స్టామినాతో సమాధానం చెప్పాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు – చిరంజీవి కలయికలో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే.
ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రు. 84 లక్షల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక హైదరాబాద్‌లో ఈ
సినిమా ఫస్ట్ డే జ్యోతి – దేవి – కోణార్క్ – సత్యం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే ఒక్కో థియేటర్లో 5 షోలు వేస్తే 5 షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. 1985 సెప్టెంబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చింది. కొందరు చిరంజీవి అభిమానులు ఫస్టాఫ్‌లో చిరంజీవికి మాటలు లేకపోవడంతో ఇదేం సినిమా అని రాఘవేంద్రరావును తిట్టుకున్నారు.
ఇక సెకండాఫ్ చూసిన జనాలకు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. దీంతో అడవిదొంగ సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటకీ హైదరాబాద్‌లో ఓ సినిమా నాలుగు థియేటర్లలో ఫస్ట్ డే రిలీజ్ అయ్యి.. ఐదు షోలు ప్రదర్శించబడి.. అన్నీ హౌస్‌ఫుల్ అయిన తొలిసినిమా అడవిదొంగ. ఈ అరుదైన టాప్ రికార్డ్ అప్పట్లో చిరంజీవికి మాత్రమే సొంతమైంది.