రెండు దశాబ్దాల క్రితం ప్రత్యూష వర్థమన తారగా ఎంట్రీ ఇచ్చి తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసింది. తక్కువ టైంలోనే మంచి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. నాగార్జున స్నేహమంటే ఇదేరా, మోహన్‌బాబు రాయుడు సినిమాలతో పాటు స్నేహమంటే ఇదేరా సినిమాలో సుమంత్‌కు జోడీగా నటించింది. తర్వాత ఉదయ్‌కిరణ్ కలుసుకోవాలని సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది.
2002లో ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్‌రెడ్డిని ఏ 1గా అరెస్టు చేశారు. సిద్ధార్థ్‌రెడ్డి 115 రోజుల పాటు జైలులో కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌రెడ్డికి పడిన శిక్షాకాలాన్ని కూడా అతడు హైకోర్టుకు వెళ్లడంతో తగ్గించారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే సిద్ధార్థ్, ప్రత్యూష కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇద్దరూ విషం తాగినా ప్రత్యూష మృతిచెందగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూష తల్లిదండ్రుల వెర్షన్ మరోలా ఉంది. తమ కుమార్తెను చంపేశారని వారు ఆరోపించారు. మునిస్వామి పోస్టుమార్టం రిపోర్టును కూడా పరిగణలోనికి తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ప్రత్యూష మృతి చెందే టైంకు ఓ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుంది. ఆమె హఠాన్మరణంతో ఆ సినిమా రిలీజ్ కాలేదు.
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ప్రత్యూష హీరోయిన్‌గా ఇదేం ఊరురా బాబు అన్న టైటిల్‌తో సినిమా తెరకెక్కింది. షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు సుబ్బయ్య ప్లాన్ చేశారు. అయితే ప్రత్యూష మృతితో ఈ సినిమాను ఎలా పూర్తి చేయాలో దర్శకుడితో పాటు ఎవ్వరికి అర్థం కాలేదు. అటు నిర్మాతలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో చివరకు ఈ సినిమాను మధ్యలోనే వదిలేశారు.
తన కెరీర్‌లో 50కు పైగా సినిమాలను తాను డైరెక్ట్ చేశాను అని.. అయితే ఇదేం ఊరురా బాబు అన్న ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ కాకుండా ఆగిపోయిందని ముత్యాల సుబ్బయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పీసీ రెడ్డి, టి. కృష్ణ దగ్గర శిష్యరికం చేసిన సుబ్బయ్య ఆ తర్వాత టి. కృష్ణ తనయుడు గోపీచంద్ తొలి సినిమా తొలివలుపుకు దర్శకత్వం వహించారు.