ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో 2000లో వచ్చిన చిత్రం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు దివంగత హీరో ఉదయ్ కిరణ్. ఉదయ్ – రీమాసేన్ జంటగా వచ్చిన ఈ సినిమాతోనే తేజ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 50 లక్షలతో తెరకెక్కి రు 6.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో తేజ, ఉదయ్ కిరణ్, రీమాసేన్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు.
చిత్రం తర్వాత ఉదయ్ కిరణ్ రెండో సినిమా కూడా తేజ దర్శకత్వంలోనే నువ్వు నేను వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్. ఈ సినిమాతో కూడా తేజ హీరోయిన్ అనితతో పాటు చాలా మంది కొత్త నటులను వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత మూడో సినిమా మనసంతా నువ్వేతో మళ్లీ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్. దీంతో ఉదయ్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌కు వెంటనే స్టార్ స్టేటస్ వచ్చేసింది. స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్లకు సైతం ఉదయ్ కిరణ్ గెస్టులుగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అదే టైంలో ఉదయ్ కిరణ్‌కు మరో బ్లాక్‌బస్టర్ మిస్ అయ్యింది. ఉదయ్‌కు వరుస హిట్లు రావడంతో సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ సారి ఫోన్ చేసి మరీ అభినందించారట. అదే టైంలో తన జయభేరీ బ్యానర్లో అతడు సినిమా తీయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ముందుగా ఈ సినిమాకు ఉదయ్ కిరణే హీరోగా అనుకున్నారట.
అయితే అదే టైంలో చిరు పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్‌కు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం, చిరు ఉదయ్ డేట్లను చూసే బాధ్యత అల్లు అరవింద్ చేతిలో పెట్టడంతో అరవింద్ అప్పటికే పెద్ద బ్యానర్లకు ఉదయ్ డేట్లు ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని ఉదయ్ మురళీమోహన్‌కు చెప్పడంతో అప్పుడు ఆయన కృష్ణతో తనకున్న స్నేహంతో మహేష్‌బాబు దగ్గరకు వెళ్లి డేట్లు తెచ్చుకున్నారు. అలా ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా మహేష్ చేతుల్లోకి వెళ్లడం.. ఆ సినిమా హిట్ అవ్వడం జరిగాయి.
ఇక సుస్మితతో ఎంగేజ్మెంట్ తర్వాత ఉదయ్ కిరణ్ క్షణం తీరికలేనంత బిజీ అయిపోయాడు. ఎప్పుడు అయితే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందో వెంటనే ఈ సినిమాలు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అదే టైంలో వరుస ప్లాపులతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఎంత స్పీడ్‌గా పైకి వెళ్లిందో ఒక్కసారిగా పడిపోయింది.