తెలుగులో రాశిగా తమిళంలో మంత్రగా నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి అసలు పేరు విజయలక్ష్మీ. అప్పటికే ఆ పేరుతో మరో హీరోయిన్ ఉన్న కారణంగా తన పేరును రాశిగా మార్చుకుంది. తెలుగులో గ్లామర్ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. రాశిది సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీనే. ఆమె తాత జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసేవారు. పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేస్తూ ఇండస్ట్రీ ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు.
ఇక రాశి తండ్రి మొదట్లో బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత ఆయన డ్యాన్సర్ గా మారాడు. ఇదే రాశికి కూడా అబ్బింది. చిన్నతనంలోనే బాలనటిగా సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. కమల్‌హాసన్‌తో కూడా బాలనటిగా ఆమె నటించింది. బాలనటిగా వరుసగా అవకాశాలు రావడంతో ఆమె పదో తరగతి వరకే చదివింది. ఆ తర్వాత సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకొని స్టార్‌గా మారింది. చాలా ఏళ్ళకి ఆంగ్ల సాహిత్యంలో బి.ఎ పూర్తి చేసింది. రాశి హీరోయిన్గా నటించిన గోకులంలో సీత, శుభాకాంక్షలు, ప్రేయసిరావే ఆమె కెరీర్లో వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేశాయి.
ఈ సినిమాలు తనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతే, ఇక కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ చిత్రాలలో నటిస్తూ అంతకంతా పాపులారిటీని తెచ్చుకుంది. నవీన్ వడ్డే, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారి సరసన ఆమె ఎక్కువగా సినిమాలు చేసి హిట్ పేయిర్ అనిపించుకుంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే, వెంకటేశ్, రవితేజ లాంటి సీనియర్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది. రాశి మత్తు కళ్ళతో కవ్విస్తూ చేసిన సముద్రం సినిమాలోని ఐటెం సాంగ్ అప్పుడు సీనీ లవర్స్‌కు చమటలు పట్టించింది.
అయితే, హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాక అనవసరంగా ఒప్పుకున్న సినిమా అంటే తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించాడు. ఇందులో రాశి గోపీచంద్ సరసన నటించింది. ఇది నెగిటివ్ రోల్. అయినా ఒప్పుకుంది. అయితే, ఓ వ్యాంప్ రోల్ మాదిరిగా ఉండే రాశి పాత్ర కొందరు అభిమానులకి నచ్చలేదు. గోపీచంద్ తో రొమాన్స్ చేయడం కూడా వారు జీర్ణించుకోలేకపోయారు. ఒకరకంగా రాశీ సినీ కెరీర్ దెబ్బ తినడానికి ఇదీ ఒక కారణం అని అంటారు. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీలో కొనసాగలేదు.