టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్మస్ కలిసొచ్చే సీజన్స్. ఈ సీజన్స్‌లో చిన్న సినిమా నుంచి మీడియం బడ్జెట్ సినిమాలు..ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు ఈ సీజన్స్ కి వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించడానికి పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఈ సారి దసరా పండుగకి నాలుగు పెద్ద సినిమాలు దసరా బరిలో దిగడానికి గట్టిగా పోటీ పడుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలిసి చేస్తున్న మలయాళ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్. ఇందులో నయనతార, సత్యదేవ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో గాడ్ ఫాదర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు చిరు.
మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర కూడా ఇదే పండుగకు రిలీజ్ చేయనున్నారు. క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ మాస్ మహారాజాకి హిట్ అనేది లేదు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనూ ఇమ్మానియేల్, మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ది ఘోస్ట్ మూవీ అక్టోబర్ 5న విడుదలవుతోంది. బంగారాజు తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక అగ్ర దర్శకుడు మణిరత్నం రూపొందుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కూడా సెప్టెంబర్ 30న పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అందరిలోనూ ఊహించని విధంగా అంచనాలున్నాయి.
అయితే, వీటన్నిటికి బాలయ్య చెక్ పెట్టబోతున్నట్టుగా తాజా సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బికె 107 శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే దసరాకే వచ్చేస్తారట. ఒకవేళ బాలయ్య రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయితే, వీరందరికీ గట్టి షాక్ తగలడం గ్యారెంటీ అనుకోవచ్చు. ఎందుకంటే అఖండ ప్రభంజనం అలాంటిది మరి. ఇప్పుడు బాలయ్య మామూలు ఫామ్‌లో లేడు. టిక్కెట్ రేట్లు తక్కువ ఉన్నప్పుడే అఖండ ఏకంగా రు. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాలయ్య ఫామ్‌కు సినిమాకు హిట్ టాక్ వస్తే మళ్లీ థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.