ఈ రోజు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మహేష్, పవన్, చరణ్, బన్నీ లాంటి వాళ్లు పదికి పైగా సినిమాలు చేశాక కానీ ఇంత స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయారు. కానీ ఎన్టీఆర్‌కు మాత్రం రెండో సినిమాతోనే తిరుగులేని స్టార్‌డమ్ వచ్చింది. ఐదో సినిమా ఆది, ఏడో సినిమా సింహాద్రి ఏకంగా ఇండస్ట్రీ హిట్లు. ఆ రెండు సినిమాల విజయాలతో సినీ జనాల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్లకే సాధ్యంకాని రికార్డులు ఆ వయస్సులోనే సొంతం చేసుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్నుచూడాలని.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా యావరేజ్. ఇక రెండో సినిమా స్టూడెంటర్ నెంబర్ 1. రాజమౌళి డెబ్యూ మూవీ. గజాలా హీరోయిన్. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ జైలులో ఉండి లా చదువుకున్న స్టూడెంట్‌గా నటించారు. ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి మ్యూజిక్ ఇలా చాలా అంశాలే హైలెట్ అయ్యాయి.
అన్నింటికి మించి ఎన్టీఆర్ తండ్రి దివంగత హరికృష్ణ వల్లే ఎన్టీఆర్‌కు స్టూడెంటర్ నెంబర్ 1 రూపంలో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్‌కు స్టార్ హీరోల వారసులను వెండితెరకు పరిచయం చేస్తే వాళ్లకు మంచి జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది. మహేష్‌బాబును రాజకుమారుడు సినిమాతో, రామ్‌చరణ్‌ను చిరుత, బన్నీని గంగోత్రి, తారకరత్నను ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలతో ఆయనే ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా కూడా ఆయనే తీయాల్సి ఉన్నా అప్పటికే ఉషాకిరణ్ వాళ్లు ముందు అప్రోచ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిన్నుచూడాలని చేశారు. తొలి సినిమాకు ముందు నుంచే హరికృష్ణ అశ్వనీదత్‌తో ఎన్టీఆర్‌తో మీ బ్యానర్లో సినిమా చేయమని అడిగేవారట. తన తనయుడికి మంచి సినిమా ఇవ్వాలని అశ్వనీదత్‌తో తరచూ చర్చించేవారట.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రెండో సినిమాను అశ్వనీదత్ తన స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. అలా హరికృష్ణ అడగడం వల్ల ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా మిస్ అయినా రెండో సినిమాను తమ బ్యానర్లో నిర్మించి సూపర్ హిట్ కొట్టామని అశ్వనీదత్ అన్నారు. ఆ తర్వాత అదే అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో కంత్రి, శక్తి సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నటించాడు.