నందమూరి హీరోలంటేనే దర్శకనిర్మాతలకు ఓ ధైర్యం. అందుకు కారణం వారు చేసే సపోర్ట్. నష్టాలలో నిర్మాతలను గట్టెక్కించిన సందర్భాలున్నాయి. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న దర్శకులకు, ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు కథను, మేకింగ్ మీద నమ్మకంతో ధైర్యం చేసి అవకాశాలిచ్చిన సందర్భాలూ చాలా ఉన్నాయి. నందమూరి హీరో ఎవరైనా దర్శకుడికి సినిమా చేద్దామని అవకాశం ఇచ్చారంటే ఆ దర్శకుడికి హిట్ గ్యారెంటీ అనే నమ్మకం వెయ్యేనుగుల బలం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ధైర్యాన్ని ఓ డైరెక్టర్‌కు ఇచ్చారు.
ఆ దర్శకుడే కొరటాల శివ. ఇప్పుడు ఈ దర్శకుడికి కంప్లీట్ మోరల్ సపోర్ట్‌గా ఉంటూ ధైర్యాన్నిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకముందు జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది. ప్రముఖ రచయితగా పాపులర్ అయిన కొరటాల శివ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కొరటాల ఆ తర్వాత మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేసి హిట్ అందుకున్నారు. అలాగే, యంగ్ టైగర్‌కి మంచి హిట్ ఇచ్చారు.
ఆ సక్సెస్ ట్రాక్ చూసే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం కొరటాల తన నాలుగేళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారు. ఇదే గ్యాప్‌లో కనీసం మూడు లేదా నాలుగు సినిమాలు చేసి ఉండేవారు. అయితే, దాదాపు రెండేళ్ళ సమయం కరోనా వల్ల కూడా వేస్ట్ అయింది. అయినా కూడా ఆచార్య కోసం ఎక్కువ సమయమే కేటాయించారు. కానీ చివరిగా ఈ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అత్యంత భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య డిజాస్టార్ అయింది.
సినిమా చూసిన అందరూ అసలు ఇది కొరటాల శినిమానేనా అని సందేహాలు వ్యక్తం చేశారు. దాని విషయం పక్కన పెడితే కొరటాల శివకు చాలామంది ఎన్.టి.ఆర్ తో సినిమా చేయవద్దని సలాహాలిచ్చారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అని నందమూరి అభిమానులు కూడా తారక్‌తో సినిమా క్యాన్సిల్ అయితే బావుంటుందని అనుకున్నారు. ఆచార్య రిజల్ట్ తర్వాత ఎన్టీఆర్ సన్నిహితులుగా ఉన్న వారు కూడా కొరటాలతో ఇప్పుడు సినిమా రిస్కే అన్నారు. ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఇదే టాక్ వినిపించింది.
కానీ, అక్కడుంది యంగ్ టైగర్..ఒక్కసారి అడుగు ముందుకు వేసి నమ్మీ మాటిస్తే దాన్ని తిరిగి తీసుకునే తత్వం కాదు. అందుకే, మనం ఈ సినిమా చేస్తున్నాము..హిట్ కోడుతున్నాము. మీరు ఇంకేమీ ఆలోచించకండి అంటూ ధైర్యాన్నిచ్చారట. అదే ఇప్పుడు కొరటాలకు బూస్ట్ అని అంటున్నారు.