టాలీవుడ్‌లో ఇప్పుడు వారసత్వ హీరోలే ఎక్కువుగా రాజ్యమేలుతున్నారు. ఇండస్ట్రీలో ముందుగా వారతస్వ హీరోగా వచ్చిన వారిలో బాలయ్య, నాగార్జు, వెంకటేష్ ఉన్నారు. ఆ తరంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ హీరో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు, నాలుగు సూపర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సడెన్‌గా ఆయన తెరమరుగు అయిపోయారు. నందమూరి ఫ్యామిలీ లాంటి బలమైన బ్యాకప్ ఉండి కూడా ఆ నటుడు ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు ? ఆయన తెరమరుగు కావడం వెనక ఏం ? జరిగింది ? అన్నది ఆసక్తికరమే.
దివంగత ఎన్టీఆర్ తన ఫ్యామిలీ నుంచి తన వారసులు హరికృష్ణ, బాలకృష్ణను వెండితెరకు పరిచయం చేశారు. అలాగే ఆయన సోదరుడు త్రివిక్రమరావు తనయుడు అయిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తిని కూడా హీరోగా తీసుకువచ్చారు. తన సోదరుడు త్రివిక్రమరావును ఎన్టీఆరే నిర్మాతగా పరిచయం చేశారు. ఎన్ఏటీ ఆర్ట్స్ బ్యానర్‌పై త్రివిక్రమరావు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత సోదరుడి కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని ఎన్టీఆరే ఆయన్ను సినిమా తెరకు పరిచయం చేశారు.
ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి హీరోగా పరిచయం అయ్యాడు. 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా అత్తగారు స్వాగతం అనే సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి రెండో సినిమా కూడా కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చింది. 1986లోనే వీరి కాంబోలో తలంబ్రాలు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఇలా తన తొలి రెండు సినిమాలను కూడా కళ్యాణ్ కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే చేశాడు.
1986లోనే కళ్యాణ్ చక్రవర్తి నటించిన మూడో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఇక 1987లో ఇంటిదొంగ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ మరుసటి యేడాది 1988లో మరో రెండు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత 1989లో మరో సినిమా చేశాక కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా వెండితెరకు దూరమైపోయాడు. 15 ఏళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని 2003లో కబీర్‌దాస్ సినిమాలో కనిపించాడు.
ఇందుకు ప్రధాన కారణం.. కళ్యాణ్ చక్రవర్తి సినిమాల్లో చివర్లో అనుకున్నంత సక్సెస్ కాకపోవడం ఓ కారణం అయితే.. ఇటు తండ్రి త్రివిక్రమరావు ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడంతో తండ్రిని చూసుకోవడం కోసం.. అటు సినిమాలకు దూరమై.. ఇటు పూర్తిగా వ్యాపారాల్లో బిజీ అయిపోయాడు. కావాల్సినంత ఒడ్డు, పొడుగుతో పాటు అందంగా ఉండే కళ్యాణ్ చక్రవర్తి మంచి స్టార్‌గా ఎదిగే అవకాశాలు కోల్పోయాడు. ప్రస్తుతం కళ్యాణ్ పూర్తిగా వ్యాపారాల్లో బిజీ అయిపోయాడు.