30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గత కొంత కాలంగా కెరీర్ పరంగా వెనకబడ్డాడు. రాజకీయాల్లోకి వెళ్లిన పృథ్వి అక్కడ దెబ్బతినడంతో పాటు ఇటు సినిమాల్లో కూడా ఛాన్సులు తగ్గిపోయాయి. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు వచ్చిన పృథ్వి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను గతంలో ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలపై చేసిన వ్యాఖ్యలను కూడా వాళ్లు పెద్ద మనస్సుతో భరించారని.. లేకుంటే తాను కనిపించని లోకాలకు వెళ్లిపోయి ఉండేవాడిని అని చెప్పాడు.
ఈ ఇంటర్వ్యూలో పృథ్వి సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు కాసేపు పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితానికి చెందిన ఓ సీక్రెట్ కూడా చెప్పాడు. తన జీవితంలో ఉన్న ఆమె గురించి పృథ్వి మనసు విప్పి మాట్లాడారు. మామూలుగా పృథ్వికి గతంలోనే మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. పృథ్వి భార్య విజయవాడలో ఉంటున్నారు.
అయితే వీరి మధ్య స్పర్థల నేపథ్యంలో ఎవరి దారుల్లో వారు ఉంటున్నారు. ఎనిమిదేళ్ల నుంచి పృథ్వి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక తాను పిల్లలను బాగా చూసుకున్నానని.. వారు సెటిల్ అయ్యారని.. తనను తన అబ్బాయి అర్థం చేసుకున్నాడని కూడా పృథ్వి చెప్పాడు. ఈ క్రమంలోనే తన జీవితంలోకి కొత్తగా వచ్చిన ఆమె గురించి పృథ్వి రివీల్ చేశాడు.
ఆమె వరంగల్ నుంచి చెన్నై మైగ్రేట్ అయ్యారని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటారని చెప్పాడు. తాను సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటి నుంచే ఆమె బాగా తెలుసని.. ఇరవై ఏళ్లుగా ఆమె తనను ఎంతో అప్యాయతతో చూసుకుంటున్నారని.. తాను కోవిడ్ టైంలో ఉండి సేవలు చేశారు.. తాను బతికి ఉన్నానంటే కారణం ఆమే అన్నారు. దీని గురించి 2023లో తాను జవాబు ఇస్తానని కూడా పృథ్వి చెప్పాడు.
ఇక ఆర్కే ఆమె పేరు చెప్పాలని రెట్టించి అడగగా ఆమె పేరు దాసరి పద్మరేఖ అని.. తాను చెన్నైలో ఉన్నప్పటి నుంచే తెలుసు.. సినిమా రంగంలో డ్యాన్సర్‌గా పనిచేశారు.. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశారని చెప్పాడు. ఇక దాసరి పద్మరేఖ గురించి మరిన్ని వివరాలు చెప్పిన పృథ్వి వాళ్ల తాతగారు తనకు బాగా తెలుసని.. తనకు ఏ సమస్య వచ్చినా వాళ్లే సాయం చేస్తారని.. షూటింగ్లో లొకేషన్లకే భోజనం కూడా పంపుతారని.. ప్రస్తుతం నా పక్కన ఉంది దాసరి పద్మరేఖనే నా ఆలనా పాలనా అంతా ఆవిడే చూసుకుంటున్నారని పృథ్వి చెప్పి పెద్ద సంచలనానికే తెరదీశాడు.