కొన్ని సంఘటనలు, కొన్ని గుర్తులు మనకు ఎప్పటకీ మరపురాని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. మీరు పైన చూస్తోన్న ఫొటో కూడా ఆ కోవలోనిదే. ఆ ఫొటో ఎవరిదో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినీ ప్రపంచంలో నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతోన్న మెగాస్టార్ చిరంజీవిది. అసలు ఈ ఫొటో ఎక్కడిది ? ఎలా బయటకు వచ్చిందన్నది కూడా ఆసక్తికరమే. జనసేన పార్టీ కార్యకర్తల పుణ్యమా ? అని ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల్లూరు సిటీ జనసేన ఇన్‌ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోన్న పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో చిరంజీవి పాత జ్ఞాపకాలను ఆయన స్నేహితుడు నటరాజ్ పంచుకున్నాడు. ఒంగోలులో డిగ్రీ చదివేరోజుల్లో స్నేహితులు అందరూ కలిసి దిగిన ఫొటోలను నటరాజ్ చూపించడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. చిరు పాత స్నేహితుడు నటరాజ్ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రసాద్ ( చిరంజీవి) నేను చాలా క్లోజ్ అని.. ఒంగోలులో డిగ్రీ చదివేటప్పుడు ఒకే ఇంట్లో మూడేళ్ల పాటు కలిసి ఉన్నాం అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు.
ఒంగోలులో డిగ్రీ చదివే రోజుల్లో చిరంజీవిని అందరూ ప్రసాద్ అని పిలిచేవారట. చిరంజీవి తన డిగ్రీ ఒంగోలు శర్మ కాలేజ్‌లో చదివారు. చిరు తండ్రి వెంకట్రావు వృత్తిరీత్యా కానిస్టేబుల్ కావడంతో ఆయన పలు ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. ఇక చిరు మెగాస్టార్‌గా ఎదిగి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రచారం చేస్తున్నప్పుడు ఒంగోలు పర్యటనకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన ఒంగోలు శర్మ కాలేజ్‌ను సందర్శించారు. ఆ టైంలో తనతో పాటు కలిసి చదువుకున్న ఎంతో మంది మిత్రులను కూడా సందర్శించారు. గతంలో చిరు పాత ఫొటోలు ఎన్నో బయటకు వచ్చినా కూడా చిరు డిగ్రీ చదువుతున్న టైంలో ఫొటో బయటకు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఫొటో దిగినప్పుడు పవన్ చాలా చిన్నపిల్లాడు అని నటరాజ్ చెప్పాడు.