Moviesడిజాస్ట‌ర్ అయినా భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ సినిమా ఇదే...!

డిజాస్ట‌ర్ అయినా భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ సినిమా ఇదే…!

కొన్ని సినిమాలు సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నా నిర్మాత‌ల‌కు, ఆ సినిమాను కొన్న వారికి న‌ష్టాలే మిగులుస్తాయి. పేరుకు మాత్ర‌మే సినిమా హిట్ అయ్యింద‌న్న ఆనందం మిగులుతుందే కానీ వాళ్ల మోముపై లాభాలు వ‌చ్చాయ‌న్న సంతోషం మాత్రం ఉండ‌దు. ఇటీవ‌ల వ‌చ్చిన పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ త్రిబుల్ ఆర్‌, త‌ర్వాత వ‌చ్చిన మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట‌, వెంకీ – వ‌రుణ్ ఎఫ్ 3 సినిమాలు పేరుకు హిట్టే అయ్యాయి. అయితే ఆ సినిమా కొన్న వారిలో ఒక‌రో ఇద్ద‌రో వ‌దిలేస్తే 80 నుంచి 90 శాతం మందికి మాత్రం లాభాలు రాలేదు.

సినిమాకు ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌డం, భారీ రేట్ల‌కు అమ్మ‌డం, అడ్వాన్స్‌లు ఎక్కువుగా తీసుకోవ‌డంతో ఇవి చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేక‌పోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చినా ఆ సినిమా కొన్న వారంద‌రికి భారీ లాభాలు తీసుకువ‌స్తుంటాయి. ఇది చాలా అరుదుగా కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే జ‌రుగుతూ ఉంటుంది. 20 ఏళ్ల క్రితం జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు చెపితే తెలుగు నాట సినీ జ‌నాలే కాదు.. ప్ర‌తి ఒక్క‌రు ఊగిపోయేవారు.

అప్ప‌ట్లో 21 ఏళ్ల‌కే ఇంకా మీసాలు కూడా ముద‌ర‌కుండానే స్టూడెంట్ నెంబ‌ర్ 1 – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో టాలీవుడ్ సింహాస‌నం మీద టాప్ ప్లేస్‌కు చేరిపోయాడు. సింహాద్రి త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన సినిమా ఆంధ్రావాలా. అప్ప‌ట్లో యూత్‌లో వ‌రుస హిట్ల‌తో క్రేజ్ తెచ్చుకున్న పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. 2004 జ‌న‌వ‌రి 1 కానుక‌గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

సింహాద్రి హిట్ అయినా కూడా ఆంధ్రావాలాను రీజ‌న‌బుల్ రేట్ల‌కే అమ్మారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా జ‌నాలు ఎగ‌బ‌డి చూశారు. సంక్రాంతి వ‌ర‌కు అంటే రెండు వారాల పాటు ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తిరుగులేకుండా పోయింది. భ‌యంక‌ర‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. రిలీజ్ రోజు ఉద‌యం ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోల నుంచి వారం రోజుల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల మోత మోగిపోయింది.

సినిమాను త‌క్కువ రేట్ల‌కు అమ్మ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు.. చివ‌ర‌కు నిర్మాత‌ల‌తో స‌హా అంద‌రికి లాభాలు అదిరిపోయాయి. సింహాద్రి థియేట‌ర్ల‌లో షేర్ మీద న‌డుస్తుండ‌గానే ఆంధ్రావాలా వ‌చ్చింది. అన్ని చోట్ల నెల రోజుల‌కే థియేట‌ర్ల నుంచి తీసేశారు. పైగా రెండు వారాల త‌ర్వాత సంక్రాంతికి బాల‌య్య న‌టించిన ల‌క్ష్మీన‌ర‌సింహా, ప్ర‌భాస్ వ‌ర్షం, మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాలు రావ‌డంతో ఆంధ్రావాలాకు లాంగ్ ర‌న్ లేదు.

ఇలా ఓవ‌రాల్‌గా డిజాస్ట‌ర్ సినిమాతో కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఘ‌న‌త‌, ఆ క్రేజ్ ఎన్టీఆర్‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది. య‌బో యావ‌రేజ్ సినిమా అయినా అల్ల‌రి రాముడు సినిమాకు కూడా తాను లెక్క‌పెడితే చేతులు నొప్పి వ‌చ్చేంత డ‌బ్బు వ‌చ్చింద‌ని ఆ సినిమా నిర్మాత చంటి అడ్డాల ఎన్నోసార్లు స్వ‌యంగా చెప్పారు. ఇక నాగ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమాకు కూడా భారీ లాభాలే వ‌చ్చాయి. ఇక రామ‌య్యా వ‌స్తావ‌య్యా అంచ‌నాలు అందుకోలేదు. అయితే దిల్ రాజు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు లాభాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. అది ఎన్టీఆర్ రేంజ్‌…!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news