అడవి మింగిన వెన్నెల
విప్లవ దారిలో సరళ విషాదగాథ
90వ దశకంలో సంచలన ఘటన
విరాటపర్వంలో సాయిపల్లవి పాత్ర
స్వేచ్ఛ కోసం.. సమానత్వం కోసం.. నీ బతుకు కోసం.. నీ భవిష్యత్తు కోసం.. మనిషిని మనిషిగా ప్రేమించే మానవ సమాజ నిర్మాణం కోసం.. తమ బతుకును బలిదానం చేసే వారే విప్లవకారులు. అలాంటి విప్లవకారులెందరో తమరక్తంతో తెలుగునేలను ఎరుపెక్కించారు. నైజామోడి గుండెల్లో నిదురించారు. మదమెక్కిన దొరతనాన్ని నిలువునా చీల్చారు. భూస్వాముల పెత్తనాన్ని మట్టికరిపించారు. ఈ వీరగాధలు.. ఈ వీరచరితల ఆధారంగా తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. ప్రజల ఆదరణ పొందాయి. తాజాగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా తెరకెక్కింది.
1990వ దశకంలో విప్లవోద్యమంలోని కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇందులో నటిస్తున్న హీరోయిన్ సాయిపల్లవి పోషించే పాత్రపైనే అందరి దృష్టిపడుతోంది. ఈ అంశం కేంద్రంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు ఈ పాత్ర ఎవరిది..? విప్లవోద్యమానికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి..? ఎందుకు అడవిబాట పట్టింది..? అన్నలను వెతుక్కుంటూ వందల కిలోమీటర్ల దూరం ఎందుకు వెళ్లింది..? ఆ పోరుదారిలో ఆమెది విజయగాథనా.. లేక విషాదగాథనా..? అనే కోణంలో అనేష్విస్తూ అనేకమంది విప్లవోద్యమ నాయకుల నుంచి సేకరించిన సమాచారం మేరకు… ఎక్స్‌క్లూసివ్ కథనం మీకోసం.
అది 1990 దశకం..
అది 1990 దశకం.. తెలుగు నేలన.. అందులోనూ తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన విప్లవోద్యమం. దొరతనానికి వ్యతిరేకంగా.. భూస్వాములకు వ్యతిరేకంగా.. దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్న రణన్నినాదం.. విప్లవగానంతో తెలుగునేలంతా ఊగిపోతున్న కాలం.. ఊరూవాడా ఉద్వేగంతో ముందుకు సాగిపోతున్న సమయం.. బడుల నుంచి.. కళాశాలల నుంచి.. విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థిలోకం విప్లవం కోసం అడవిదారిపడుతున్న సందర్భంలో.. విప్లవాన్ని ప్రేమించి పోరుబాటలో మమేకమవడానికి ముందుకుసాగిన ఓ యువతి ఘటన సంచలనం కలిగించింది. మూడు దశాబ్దాల క్రితం తెలుగు నేలపై రక్తాభిషేక ఘటన. చరిత్ర పునాదుల కింద ఇంకా సజీవంగానే ఉంది. ఆ తరం వ్యక్తులకు ఇంకా అది ఒక తడారని నెత్తుటి జ్ఞాపకమే. నేటి తరానికి అది ఒక ఉద్వేగపూరిత సమాచారమే.
పోరుదారిలో సరళ
ఆమె అరణ్యాన్ని ప్రేమించింది. విప్లవాన్ని ఆవాహనం చేసుకుంది. నరనరాల్లో నక్సల్బరీ జీవితాన్ని ప్రేరేపించుకుంది. తాడిత పీడిత జనాల కోసం ఉద్యమించాలనుకుంది. సాయుధపోరులో మమేకం కావాలని కలలుకన్నది. ఆమే ఖమ్మం జిల్లాకు చెందిన 17 సంవత్సరాల సరళ. తండ్రిది కూడా సాయుధ విప్లవోద్యమ నేపథ్యం. దీంతో సహజంగానే.. ప్రజల కోసం బతకాలి.. ప్రజల కోసం మాత్రమే జీవించాలి.. పీడన, దోపిడీ లేని, మనుషులందరూ సమానంగా జీవించే సమాజ నిర్మాణం కోసం కలలుకన్నది. ఆ పోరాటంలో తాను భాగస్వామిని కావాలన్న సంకల్పంతో కదనరంగానికి కదిలింది సరళ. మొదట సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అనుబంధ విద్యార్థి సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ)లో పనిచేసింది. అధ్యయనం చేయడం ఆమె దినచర్యలో భాగమైంది. కొంతకాలం పనిచేసిన తర్వాత.. తాను అడవిలో పనిచేస్తానని, అన్నలతో కలిసి పోరాడుతానని సరళ చెప్పడంతో పార్టీ ఒప్పుకోలేదు. మరికొంత కాలం విద్యార్థి సంఘంలోనే పనిచేయాలని, ఇంకా అధ్యయనం చేయాలని, సమాజ జ్ఞానం మరింత సంపాదించుకోవాలని సూచించడంతో సరళ.. క్రమంగా ఆ విద్యార్థి సంఘానికి దూరమైంది.
మొండిధైర్యంతో ముందుకు…
అయితే.. ఆ సమయంలో ఖమ్మం, ఇల్లందు, వరంగల్, ములుగు తదితర ప్రాంతాల్లో న్యూడెమోక్రసీ చాలా బలంగా ఉంది. పీపుల్స్‌వార్.. న్యూడెమోక్రసీ మధ్య కూడా కొంత ఘర్షణవాతావరణం ఉంది. ఇదే సమయంలో కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పీపుల్స్‌వార్ ప్రభావం ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో నక్సలైట్ ఉద్యమం సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సందర్భం. ఇక్కడ ప్రధానంగా దళకమాండర్ జ్యోతక్క పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎలాగైనా.. అడవిలోకి వెళ్లి.. అన్నలతో కలిసి పనిచేయాలన్న సంకల్పంతో ఉన్న సరళ.. జ్యోతక్కను స్ఫూర్తిగా తీసుకుంది. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనుకుంది. అదే పట్టుదలతో ఉన్న సరళ.. ఒక హేతువాది ఇచ్చిన సలహాతో.. అమ్మానాన్నను, అన్నదమ్ములను వదిలేసి నిజామాబాద్‌కు బయలుదేరింది. ఆ సమయంలో అడుగడుగునా నిర్బంధం.. పోలీసుల తనిఖీలు.. ఒంటరిగా కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి.. అడవిలో అన్నలు ఎక్కడ ఉంటారో తెలియదు. అయినా.. వెళ్లాలి.. వెళ్లితీరాలి.. అన్నలతో కలిసి ప్రజల కోసం పోరాటం చేయాలన్న కసి.. సరళను మొండిధైర్యంతో ముందుకు నడిపించింది.
ఆ గ్రామంలో టీచర్‌గా…
ఎట్టకేలకు అనేక అడ్డంకులను దాటుకుంటూ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న సరళ.. ఒక గ్రామంలో టీచర్‌గా కూడా పనిచేసినట్లు కొందరు చెబుతున్నారు. ఆ గ్రామంలో టీచర్‌గా పనిచేస్తూనే.. దళాన్ని కలిసేందుకు.. అన్నల కోసం వాకబు చేయడం మొదలు పెట్టింది. ఇలా పదిహేను నుంచి ఇరవై రోజులు ప్రయత్నం చేసింది. అన్నల కోసం వాకబు చేస్తున్ననట్లు తెలియడంతో స్థానిక మిలిటెంట్లు గమనించడం మొదలు పెట్టారు. అయితే.. ఆ సమయంలోనే.. పోలీసులు కూడా పలువురు కోవర్టులను దళాల్లోకి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, స్థానిక కమిటీలు, దళాలు అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు పార్టీ నుంచి రావడంతో సరళపై మిలిటెంట్లకు అనుమానం కలిగింది. ఖమ్మం నుంచి నిజామాబాద్‌కు రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? ఇది కచ్చితంగా పోలీసుల పనేనని, పార్టీ రహస్యాలను పోలీసులకు అందించడానికే వచ్చిందన్న అనుమానాన్ని మిలిటెంట్లు బలంగా వెలిబుచ్చడంతో పార్టీ జిల్లా కమిటీ విచారణకు ఆదేశించింది.
అంతా నిశ్శబ్దం..
ఒక రోజు పచ్చని అడవిలో విచారణ మొదలుపెట్టారు. కళ్లార్పకుండా ఏం జరుగుతుందో చూస్తున్న స్థానికులు.. సాయుధులైన దళనాయకులు ఆమె చుట్టూ చేరి తుపాకులు ఎక్కుపెట్టారు. దీంతో భయంభయంగా సరళ చుట్టూ చూస్తోంది. నిశ్శబ్దం.. అంతా నిశ్శబ్దం.. కొద్ది సమయం తర్వాత ప్రశ్నల తూటాలు మొదలయ్యాయి. ఇక్కడికెందుకొచ్చావ్..? మా గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావ్..? నిజం చెప్పు.. నీవు పోలీస్ ఇన్ఫార్మరా..? ఖాకీలు తోలితే వచ్చావా..? చెప్పు.. నిజం చెప్పు.. అంటూ ప్రశ్నల వర్షం వస్తోంది. దళనాయకులు సరళను విచారిస్తున్న సమయంలో.. తాను నిజాయితీగా వచ్చానని, తనను పోలీసులు పంపించలేదని సరళ స్పష్టంగా చెప్పింది. కానీ.. ఆమె ఎంత చెప్పినా కూడా వారు నమ్మలేదు. అయితే.. ఆమె కణతిపై తుపాకీపెట్టి ప్రశ్నిస్తున్నారు. చిగురుటాకువలె ఆమె వణికిపోతోంది. ఏం జరుగుతోందో.. ఏం చేయాలో.. ఆమెకు తెలియని పరిస్థితి.
ఈ క్రమంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం. అది ఒక తుపాకీ గర్జించిన శబ్దం. ఆ శబ్దంతో కలిసి సరళ విప్లవధ్వని గాల్లో కలిసిపోయింది. ఆమె శరీరం నేలతల్లిని తాకింది. ఆమె నెత్తురు భూదేవి అభిషేకం చేసింది. అరణ్యం మూగబోయింది. ఒక విప్లవోద్యమ ఆశల సౌధం పుడమితల్లి ఒడిలో విగతజీవిగా పడింది. నమ్ముకుని వచ్చిన అడవే ఆమెను మింగేసింది. కన్నతల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంగారు భవిష్యత్‌ను వదులుకుని విప్లవోద్యమ దారిలో రావాలని కలల కన్న సరళ.. తన ప్రయాణం ప్రారంభించకుండానే ప్రాణాలను వదిలింది. విప్లవోద్యమ చరిత్రలో ఈ ఘటన ఒక మాయనిమచ్చని మూటగట్టుకుంది.
అంతులేని ఈ విషాదం జ్ఞప్తికి తెచ్చుకుంటే ఒళ్లు ఝలధరిస్తుంది. గుండెను పిండేస్తుంది. కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. హృదయం బరువెక్కుతుంది. అయితే.. సరళ మృతికి సంబంధించి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్లు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేక సరళ మృతి చెందిందని కొందరు పేర్కొన్నారు. సరళను కోవర్టుగా అనుమానించిన దళనాయకులు తొందరపాటుతో ఆమెను కాల్చివేశారని ఇంకొందరు అనగా.. విచారిస్తున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్ అయి సరళ మృతి చెందిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా సిద్ధాంతాన్ని నమ్మి విప్లవోద్యమంలో మమేకం కావడానికి ముందుకు వచ్చిన యువతి ప్రాణాలను హరించడం దురదృష్టకరం. అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగింది. బాల్‌గోపాల్ లాంటి అనేక మంది ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
చివరకు సరళ ఘటనలో…
చివరకు సరళ ఘటనలో నిజానిజాలు తెలుసుకున్న పీపుల్స్‌వార్ పార్టీ తమది తప్పేనని ప్రకటించింది. అయితే.. అడవిలో అన్నలతో కలిసి పనిచేయాలని బయలుదేరిన సరళది.. పోరుదారిలో విషాదగాథగానే మిగిలిపోయింది. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన సరళ.. అనుమానానికి.. తొందరపాటుకు బలైపోయింది. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు కదిలిన సరళ.. కదనరంగానికి చేరకుండానే కనుమూసింది. విప్లవోద్యమ చరిత్రలో సరళ ఘటన.. పార్టీకి మాయనిమచ్చగానే మిగిలిపోయింది. సరళ నిజాయితీని కనిపెట్టి ఉంటే.. ప్రజల కోసం పనిచేయాలన్న తపనను పసిగట్టి ఉంటే.. విప్లవోద్యమంలో ఆమె గొప్పనేతగా ఎదిగి ఉండేదని కొందరు బరువెక్కిన గుండెలతో చెబుతున్నారు. సరళ మృతి అప్పట్లో సంచలనం సృష్టించింది.
అయితే.. సరళ జీవితంలోని కొన్ని అంశాలను తీసుకుని విరాటపర్వంలోని సాయిపల్లవి పాత్రను సృష్టించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియమైన అరణ్య.. నీకు నేను అభిమాని అయిపోయా.. నీ కవిత్వం చదువుతుంటే నాలో ఏదో భావోద్వేగం రగులుతోంది.. మీరాబాయి కృష్ణుడి కోసం కన్నవారిని..కట్టుకున్నవాడిని వదిలేసి ఎలా వెళ్లిపోయిందో.. అలా నీ కోసం వస్తున్నా.. అంటూ సాయిపల్లవి చెప్పిన మాటలను సినిమా ట్రైలర్‌లో వినిపించారు. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను సాయిపల్లవి పోషిస్తోందని సినిమా డైరెక్టర్ చెప్పారు. కానీ.. ఏపాత్ర అనేది చెప్పలేదు. కానీ.. సరళ యధార్థ ఘటననే ఈ సినిమాలో చూపిస్తున్నా అత్యంత విశ్వాసనీయ సమాచారం. అయితే.. సరళ యధార్థ ఘటనను యథాతథంగా వాడుకుంటారా..? లేక ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా..? అన్నది తెలియదు. ఈ ఊహాగానాలకు చెక్‌పడాలంటే.. సినిమా విడుదల జూన్ 17 వరకు ఆగాల్సిందే మరి..!
కాగా, మూడు దశాబ్దాలనాటి సంచలన యధార్థ ఘటనను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో చేసిన అన్వేషణకు ఈ కథనం అక్షరరూపం.
ములుక రవి
– అక్షరశక్తి, ప్రధానప్రతినిధి