టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో 30, 31 సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాకు కొరటాల శివ, 31వ సినిమా కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్లుగా ఉన్నారు. టెంపర్ నుంచి ప్లాప్ అన్నదే లేకుండా వరుస హిట్లు కొడుతోన్న ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారిపోయాడు.
ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని కూడా సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నాని కరోనా టైంలో కూడా వి – టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇక గత డిసెంబర్లో శ్యామ్‌సింగ రాయ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. తాజాగా అంటే సుందరానికి సినిమాతో మళ్లీ ఆరు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇలా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని .. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన 7 సినిమాలు యూఎస్‌లో 1 మిలియన్ మార్క్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు నాని కూడా అంటే సుందరానికి సినిమాతో యూఎస్‌లో 1 మిలియన్ మార్క్ టచ్ చేసి ఎన్టీఆర్‌తో సమానంగా 7 మిలియన్ క్లబ్ ఉన్న హీరోగా చేరిపోయాడు.
ఈ లిస్టులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. మహేష్ నటించిన 11 సినిమాలు అక్కడ మిలియన్ క్లబ్‌లో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 6 సినిమాలు, అల్లు అర్జున్ నటించిన 5 సినిమాలు కూడా అక్కడ మిలియన్ మార్క్ క్లబ్‌లో చేరాయి. ఇక నాని అంటే సుందరానికి తాజాగా అక్కడ మిలియన్ మార్క్‌కు చేరువైంది.
ఇటీవల సౌత్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరుగుతోంది. కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమా సైతం అక్కడ 2.5 మిలియన్ డాలర్లు దాటేసి 3 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది.