కొన్ని సార్లు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఓ హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేయడం… హిట్ లేదా ప్లాప్ కొట్టడం జరుగుతూ ఉంటుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో నరసింహానాయుడు సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్. 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి మృగరాజు సినిమాకు పోటీగా వచ్చి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సంక్రాంతికే విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు సినిమా కూడా వచ్చింది. ఇక నరసింహానాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి భారతదేశ సినీ చరిత్రలో ఫస్ట్ టైం 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకుడు. అయితే ఈ సినిమా కంటే ముందు బాలయ్య రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన అయోధ్య రామయ్య సినిమాలో ముందుగా నటించాలి. పోసాని కృష్ణమురళీ రచన చేసిన ఈ సినిమాలో శ్రీహరి ద్విపాత్రాభినయం పోషించారు. ఈ కథతోనే బాలయ్య హీరోగా సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ కథ కొందరికి నచ్చకపోవడంతో ఈ సినిమా ముందుకు సాగలేదు.
అయితే చిన్ని కృష్ణ చెప్పిన లైన్ పరుచూరి సోదరులకు బాగా నచ్చేసింది. దీంతో పరుచూరు సోదరులు బి. గోపాల్‌కు కథ చెప్పించారు. ఈ కథ విన్న బాలయ్య కూడా పిచ్చగా నచ్చేయడంతో వెంటనే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. అలా నరసింహానాయుడు సినిమా స్టార్ట్ అయ్యింది. ముందుగా సిమ్రాన్ పాత్రకు సౌందర్యను, ప్రితీ జింగానియా పాత్రకు సిమ్రాన్‌ను అనుకున్నారు. అప్పుడు సౌందర్య డేట్లు ఖాళీ లేవు. దీంతో సిమ్రాన్‌ను సౌందర్య చేయాల్సిన శ్రావణి పాత్రలోకి తీసుకుని.. మరో పాత్రకు తమ్ముడు సినిమాలో నటించిన ప్రీతి జింగానియాను తీసుకున్నారు.
ఇక బాలయ్యకు మరదలిగా లక్స్‌పాప పాత్రకు అషా శైనీ ( ఫ్లోరాసైనీ)ని తీసుకున్నారు. అయితే నరసింహానాయుడు కనివినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. ఈ సినిమా బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్లో వరుసగా నాలుగో హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య ముందుగా చేయాల్సిన అయోధ్య రామయ్య సినిమా చివరకు శ్రీహరికి వెళ్లింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యి శ్రీహరికి మంచి పేరు తీసుకువచ్చింది.