నటసింహం బాలయ్య కెరీర్‌లో నరసింహానాయుడు ఎంత బ్లాక్‌బస్టర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య అసలు సిసలు సత్తా ఏంటో ఇండస్ట్రీకి చాటి చెప్పింది. 2001 సంక్రాంతి బరిలోకి దిగిన నరసింహానాయుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవీపుత్రుడు సినిమాలకు పోటీగా వచ్చి మరీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. నరసింహానాయుడు దూకుడుతో పై రెండు సినిమాలు అసలు బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోయాయి.
నరసింహానాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా అప్పట్లో పలు పల్లెటూర్లలో రిలీజ్ అయ్యి శతదినోత్సవం జరుపుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో ఫస్ట్ టైం రిలీజ్ సినిమాగా శ్రీ లక్ష్మీ టాకీస్‌లో రిలీజ్ అయ్యింది. సీ సెంటర్ అయిన ఈ ఊర్లో డైరెక్ట్ 4 ఆటలతో 4 రోజులు ఆడి కామవరపుకోట చరిత్రలో ఏకైక శతదినోత్సవ సినిమాగా మిగిలిపోయింది.
ఇక కర్నూలు జిల్లా గూడూరు, కోడుమూరులో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. సింగిల్ ఫ్రింట్‌తో ఈ రెండు చోట్ల శతదినోత్సవం జరుపుకుని కనివినీ ఎరుగని రికార్డ్ తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ( ఇప్పుడు ఏలూరు జిల్లా కేంద్రం ) ఏలూరులో అంబికా కాంప్లెక్స్‌లో నరసింహానాయుడు ఆలిండియా వైడ్‌గా చెక్కు చెదరని రికార్డ్ కొట్టేసింది.
ఈ కాంప్లెక్స్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణది. నరసింహానాయుడు సినిమాతో మినీ అంబికా థియేటర్ స్టార్ట్ అయ్యింది. బాలయ్యకు వీరాభిమాని అయిన అంబికా కృష్ణ ఆయన చేతుల మీదుగానే థియేటర్‌ను ప్రారంభింపజేశారు. ఇక 11 జనవరి, 2001న మినీ అంబికా థియేటర్ నరసింహానాయుడు సినిమాతో ప్రారంభమైంది. ముందు ఈ ఒక్క థియేటర్లోనే సినిమా అనుకున్నారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకే సినిమాకు యునానమస్ బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో క్రౌడ్ హెవీ అయిపోయింది.
చివరకు అదే కాంప్లెక్స్‌లో అంబికా థియేటర్లో కూడా సినిమాను ఫస్ట్ డే స్టార్ట్ చేసేశారు. అలా వారం రోజుల పాటు రెండు థియేటర్లలో 24 గంటల పాటు వరుసగా బ్రేక్ లేకుండా షోలు వేస్తున్నా కూడా జనాలు రాత్రి, పగలు తేడా లేకుండా వచ్చి మరీ సినిమా చూశారు. ఈ క్రమంలోనే ఫస్ట్ 7 రోజులకు అంబికా కాంప్లెక్స్‌లోని 2 థియేటర్లలో ఏకంగా 101 షోలు ఆడి తిరుగులేని రికార్డ్ సొంతం చేసుకుంది నరసింహానాయుడు.
అంబికాలో 43 షోలు, మినీ అంబికాలో 58.. మొత్తం రెండు థియేటర్లలో 101 ఆటలు ఆడింది.
అప్పట్లో మల్టీఫ్లెక్స్‌లు లేవు. అలాంటి టైంలో ఒకే కాంప్లెక్స్‌లోని రెండు థియేటర్లలో 7 రోజుల పాటు 24 గంటలు ఆడి 101 షోలు ప్రదర్శింపబడడం అంటే చెక్కు చెదరని రికార్డే. ఈ విషయాన్ని అంబికా కృష్ణే స్వయంగా చెప్పారు. విచిత్రం ఏంటంటే నెల రోజుల పాటు అంబికా, అంబికా మినీ రెండు థియేటర్లలో కంటిన్యూగా ఆడిన ఈ సినిమా మినీ అంబికాలో డైరెక్టుగా 4 ఆటలతో 275 రోజుల పాటు ప్రదర్శింపబడింది.
ఆ తర్వాత ఇదే కాంప్లెక్స్‌లో అంబికా లిటిల్ థియేటర్‌ను కూడా నరసింహానాయుడు రన్ అవుతుండగానే ఓపెన్ చేశారు. మినీ అంబికాలో 275 రోజుల తర్వాత లిటిల్ అంబికాకు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా 40 రోజుల వరకు ఆడింది. ఆ తర్వాత అదే ఏలూరులో రమామహాల్‌కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా మరో నెల రోజుల పాటు ఆడింది. ఓవరాల్‌గా ఏలూరులో థియేటర్లు తిరుగుతూ యేడాదికి దగ్గరగా ఆడింది. ఇక వారం రోజుల పాటు 101 షోలు ఒకే కాంప్లెక్స్‌లో ఆడడంతో పాటు కొత్త థియేటర్లో ప్రారంభ చిత్రంగా వచ్చి 275 రోజులు డైరెక్టుగా ఆడడం ఒక్క నరసింహానాయుడు సినిమాకు మాత్రమే చెల్లింది. ఆ రికార్డ్ ఇప్పటకీ తెలుగు గడ్డపై ఏ సినిమా కూడా బీట్ చేయలేదు.