ఇప్పుడంటే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చింది. ఒకప్పుడు మన ఇండస్ట్రీ అంతా మద్రాస్‌లోనే ఉండేది. తెలుగు సినిమా షూటింగ్‌లు, ఇతర వ్యవహారాలు అన్ని మద్రాస్ కేంద్రంగానే నడిచేవి. మన హీరోలు, దర్శకులు అందరూ కూడా మద్రాస్‌లోనే నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే కొందరు అక్కడ సొంత నివాసాలు కొనుక్కోవడంతో పాటు బాగానే ఆస్తులు కూడబెట్టుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమా వాళ్ల పెట్టుబడులు అన్నీ ఎక్కువుగా హైదరాబాద్, బెంగళూరులోనే ఉంటున్నాయి.
అప్పట్లో మద్రాస్‌లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రముఖ హీరోలు తరచూ ఫంక్షన్లలో ఎక్కువుగా కలుసుకునే వారు. అయితే స్టార్ హీరోల భార్యలు మాత్రం ఎప్పుడో తమకు బాగా కావాల్సిన ఆత్మీయుల ఫంక్షన్లకు మాత్రమే వచ్చేవారు. వారు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. పై ఫొటోలో తెలుగు సినిమా రంగంలో మకుటుం లేకుండా వెలుగొందిన ముగ్గురు లెజెండ్రీ పర్సన్స్ భార్యలు కనిపిస్తున్నారు.
ఆ ముగ్గురు లెజెండ్రీ పర్సన్స్ ఎవరో కాదు ఎడమ నుంచి కుడి వైపునకు చూస్తే అక్కినేని అన్నపూర్ణ ( అక్కినేని నాగేశ్వరరావు భార్య ) , బసవతారకం ( NTR భార్య ) , వీరమాచినేని వసుంధరా దేవి ( వి. బి. రాజేంద్రప్రసాద్ గారి భార్య). ఈ ముగ్గురు లెజెండ్రీ సినిమా పర్సన్స్ భార్యలు కలుసుకున్న అరుదైన సందర్భం చెన్నైలో జరిగింది. చెన్నైలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు ఈ ముగ్గురు హాజరయ్యారు. ఈ ముగ్గురి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే..
అక్కినేని అన్నపూర్ణ:
దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు భార్య అక్కినేని అన్నపూర్ణ. పేరుకు తగ్గట్టే ఆమె ఎంతో మందిని ఆదుకున్న అన్నపూర్ణ అని ఇండస్ట్రీ జనాలు చెపుతూ ఉండేవారు. 1933లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సమీపంలో పుట్టిన అన్నపూర్ణ 15 ఏళ్ల వయస్సులో 1949 ఫిబ్రవరి 18న ఏఎన్నార్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. కుమారుల్లో నాగార్జున టాలీవుడ్ సీనియర్ హీరో. మరో కుమారుడు వెంకట్.. కొన్ని సినిమాలకు నిర్మాతగా ఉండి.. ఇప్పుడు వైజాగ్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక సుమంత్, సుప్రియ తల్లితో పాటు హీరో సుశాంత్ తల్లి నాగసుశీల కూడా ఏఎన్నార్ మరో కుమార్తె.
బసవతారకం:
దివంగత విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్‌కు సొంత మరదలే బసవతారకం. కృష్ణా జిల్లాలోని కొమరవోలులో బసవతారకం పుట్టారు. 1942 మే లో NTR బసవతారకంల వివాహం జరిగింది. వీరికి 12 మంది సంతానం కాగా ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుల్లో రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ ఉన్నారు. కుమార్తెల్లో గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి ఉన్నారు. వీరిలో భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భార్య కాగా… పురందేశ్వరి కేంద్ర మాజీ మంత్రి.
వీరమాచినేని వసుంధరా దేవి:
వీరమాచినేని వసుంధరా దేవి ఎవరో కాదు.. ఒకప్పటి అగ్ర దర్శకనిర్మాత విబి. రాజేంద్ర ప్రసాద్‌కు భార్య. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఈ దంపతుల కుమారుడే. తన కుమారుడు జగపతిబాబు పేరు మీద జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు, నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లోనే అగ్రశ్రేణి బ్యానర్లలో ఒకటిగా తన బ్యానర్‌ను నిలిపారు. ఏఎన్నార్‌తో ఆయన ఎన్నో హిట్లు తీశారు. బాలయ్య బ్లాక్ బస్టర్ బంగారు బుల్లోడు కూడా ఈ బ్యానర్లో వచ్చిందే. ఈ దంపతులకు జగపతిబాబుతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.