టాలీవుడ్ ఇండస్ట్రీలో నటరత్న ఎన్టీఆర్, సూపర్‌స్టార్ కృష్ణ మధ్య దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల పరంగా పోటీ నడిచింది. ఎన్టీఆర్ ఓ సినిమాతో హిట్ కొడితే కృష్ణ సైతం ఆ సినిమాను మించిన సినిమా తీయాలని పోటీ పడేవారు. అలాగే ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మహాభారత కథ ఆధారంగా దానవీర శూరకర్ణ సినిమా చేస్తే కృష్ణ ఆ సినిమాకు పోటీగా అదే మహాభారత కథతో కురుక్షేత్రం సినిమా తీయడంతో పాటు ఎన్టీఆర్ కర్ణకు పోటీగా రిలీజ్ చేయించారు.
అప్పుడు కర్ణ సినిమా పై చేయి సాధించడంతో పాటు చరిత్రలో ఎప్పటకీ నిలిచిపోయే సినిమా అయ్యింది. ఈ ఒక్క సినిమాయే కాదు… ఎన్నో సినిమాలు, క్యారెక్టర్లు.. చివరకు రాజకీయ పరంగా కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉండేది. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణ కూడా పద్మాలయా బ్యానర్ స్థాపించి సినిమాలు తీశారు. ఎన్టీఆర్ జానపద సినిమాలు చేస్తే.. కృష్ణ కూడా సింహాసనం లాంటి తొలి 70 ఎంఎం సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేశాడు.
ఇక వీరిద్దరి మధ్య తొలిసారి పోటీ ఎప్పుడు ? జరిగింది ? ఎవరు పై చేయి సాధించారు ? అన్నది ఇంట్రస్టింగ్ అంశమే. వీరి మధ్య తొలిసారి పోటీ 1976లో జరిగింది. 1976 మార్చి 22న ఎన్టీఆర్ నటించన నిర్దోషి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తే ఎలా ? ఉంటుంది ? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఆ మరుసటి రోజే మార్చి 23న కృష్ణ నటించిన ఇద్దరు మొనగాళ్లు సినిమా వచ్చింది. అయితే అప్పటి వరకు కృష్ణ కెరీర్‌లో చేసింది మూడు సినిమాలే. ఇది కృష్ణకు నాలుగో సినిమా. ఈ సినిమాలో కృష్ణతో పాటు కాంతారావు కూడా మరో హీరోగా నటించారు. ఇందులో కథా పరంగా ఇద్దరూ రాజకుమారులే అయితే కృష్ణ చిన్నప్పుడే తప్పిపోయి అడవిలో పెరుగుతాడు.
ఈ క్రమంలోనే సినిమాలో సోదరులు అయిన కృష్ణ, కాంతారావు మధ్య అదిరిపోయే ఫైటింగ్ సీన్లు జరుగుతాయి. ఎన్టీఆర్‌కు పోటీగా కృష్ణ సినిమా తట్టుకుని నిలబడుతుందా ? అని చాలా మంది అనుకున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ నిర్దోషి, కృష్ణ ఇద్దరు మొనగాళ్లు రెండూ కూడా నిలిచాయి. రెండు హిట్ అయ్యాయి. అలా ఈ ఇద్దరు స్టార్ హీరోల తొలి పోరాటంలో ఇద్దరు విజయం సాధించారు.