నటనకే ఓనమాలు నేర్పిన ఘనుడు, జనం మెచ్చిన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో చెరగరాని ముద్ర వేయించుకున్న ఈయన.. ముడు వందలకు పైగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా కూడా ఈ రోజుకు ఓ కృష్ణుడు, ఓ రాముడు అంటే తెలుగు జనాలు ఎన్టీఆర్‌నే ఊహించుకునేంత గొప్పగా ఆయన తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాడు.
ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చారు. కానీ, బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ తరువాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్ తరువాత ఈ తరం జనరేషన్ కుర్ర హీరోల్లో అంతటి నటనా చాతుర్యం గల నటుడు ఎవరైనా ఉన్నారా అంటే తారక్ పేరే మొదట వినిపిస్తుంది. నందమూరి హరికృష్ణ,షాలిని దంపతులకు జన్మించిన తారక్.. తన 13వ ఏట తాత గారి సినిమా `బ్రహ్మర్షి విశ్వామిత్ర`తో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు.
అతడి అసలు పేరు `తారక్ రామ్` . కానీ, పెద్దాయన స్వయంగా మనవడి పేరుని నందమూరి తారక రామారావు గా మార్చారు. అయితే ఎంతో మంది మనవళ్లు ఉన్నా.. సీనియర్ ఎన్టీఆర్ తన పేరును తారక్ కు మాత్రమే పెట్టడం వెనక రహస్యం ఏంటో చాలా మందికి తెలియదు. అసలు తాత పేరు తారక్‌కు ఎలా వచ్చిందంటే.. 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను తొలిసారి పెద్దాయన వద్దకు తీసుకెళ్లారట హరికృష్ణ.
తారక్‌ను చూడగానే సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుని `నీ పేరేంటి బాబు` అని అడిగగా.. అందుకు తారక్ రామ్ అని సమాధానం ఇచ్చాడట. అది విన్న పెద్దాయన హరికృష్ణ వైపు చూస్తూ ఎందుకు నువ్వు ఆ పేరు పెట్టావని అడిగారట. అమ్మ పేరు, రాముడిపేరు కలుస్తుందని పెట్టినట్లు ఆయన జవాబు ఇచ్చారట. దాంతో పెద్దాయన నీది నా అంశ, నాపేరు నీకు ఉండాలని తారక్ రామ్‌ను నందమూరి తారక రామారావుగా మార్చారట. అలాగే భవిష్యత్తులో గొప్ప వాడు అవుతావని తారక్‌ను ఆశీర్వదించారట.
ఇక నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఆనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు తెరపై తిరుగులేని ఈ తరం కథానాయకుడిగా, తాతకు తగ్గా మనవుడిగా గుర్తింపు తెచ్చకుని కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు.