ఆచార్య అపజయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చేసేదేం లేదిక. ఈ పరజయానికి కారణాలు అన్వేషించుకోవాలి.. వచ్చే సినిమాల్లో ఈ తప్పులు మరోసారి దొర్లకుండా చూసుకోవాలి. సరే సినిమా ఎలా ఉన్నా.. తమ అభిమాన హీరో సినిమా చూడాలన్న తాపత్రయం ఆ హీరోల అభిమానుల్లో కనిపిస్తుంది. కానీ ఆచార్యకు అది కూడా దక్కలేదు. మెగా వీరాభిమానులు కూడా సినిమాను లైట్ తీస్కొన్నారు.
అసలు చిరంజీవి అంటే ఊగిపోయే గోదావరితో పాటు కృష్ణా జిల్లాల్లో కూడా చాలా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టలేదంటనే ఈ సినిమా విషయంలో వారు ముందు నుంచి ఎందుకంత నిరాసక్తతో ఉన్నారో ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న ? అసలే థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2 దెబ్బతో ఆచార్యకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకలేదు.
ఇక ఇప్పుడు మరో షాక్ ఏంటంటే శుక్ర, శనివారాల్లోనే ఆచార్య తేలిపోయింది. దీంతో ఆదివారం నుంచే చాలా చోట్ల ఆచార్యను ఎత్తివేస్తున్నారు. కొన్ని చోట్ల కేజీయఫ్, మరి కొన్ని చోట్ల త్రిబుల్ ఆర్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త సినిమా ఆచార్యకు వస్తోన్న షేర్‌కు, త్రిబుల్ ఆర్‌కు వస్తోన్న షేర్‌కు పెద్ద వ్యత్యాసం ఉండడం లేదట. దీంతో చాలా మంది ఆచార్యకు బదులుగా త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2 ఆడించేందుకే మొగ్గు చూపుతున్నారు.
గుంటూరు జిల్లాలోని వినుకొండలో అరుణ డీలక్స్‌లో ఫస్ట్ డేకే ఆచార్యను ఎత్తివేసి త్రిబుల్ ఆర్ రన్ చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చిరంజీవికి కంచుకోట అయిన విజయవాడ లాంటి చోట్ల కూడా పలు మల్టీఫ్లెక్స్‌లు, డబుల్ థియేటర్లు ఉన్న చోట ఆచార్య షోలు తగ్గించేసి త్రిబుల్ ఆర్, కేజీయఫ్ వేస్తున్నారు.
ఇదే ఆచార్యకు, మెగాస్టార్ రేంజ్‌కు పెద్ద అవమానం అనుకుంటే.. ఆచార్య ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ రు. 53 కోట్లు వచ్చింది. ఓ మోస్తరు సినిమాలకే ఫస్ట్ డే రు. 70 కోట్ల నుంచి రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. కానీ ఆచార్యకు వచ్చిన రు. 53 కోట్లు చాలా తక్కువే అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే ఫస్ట్ వీకెండ్‌లో శని, ఆదివారాల్లో సినిమా చూడాలని టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ఆచార్య ఎక్కడో తేడా కొట్టేసింది. ఇది ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించనే లేదు.