Moviesఅల్లూరి పాత్ర‌కు ఎన్టీయార్‌కు ఇంత లింక్ ఉందా...!

అల్లూరి పాత్ర‌కు ఎన్టీయార్‌కు ఇంత లింక్ ఉందా…!

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారికి సదా స్మరణీయుడు. ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత కీలకమైన భూమిక పోషించారు. సాయుధ బలంతోనే తెల్ల దొరలను ఎదిరించాలన్న ఆయన పట్టుదల గొప్పది. చేతిలో అతి తక్కువ ఆయుధ సంపత్తి ఉన్నా ఆయనలో గట్టి సంకల్పం మాత్రం తెల్లదొరలను గడగడలాడించింది.

విషయానికి వస్తే అలాంటి విప్లవమూర్తి అల్లూరి జీవిత చరిత్రను సినిమాగా తీసి ఆయన పాత్ర తాను పోషించి తన నట జీవితాన్ని పునీతం చేసుకోవాలని ఎన్టీయార్ భావించారు. ఆయన ఈ ప్రయత్నాన్ని 1950 దశకం చివర‌లోనే మొదలెట్టారు. ఆనాటి ప్రముఖ నాటక రచయిత పడాల రామారావు చేత స్క్రిప్ట్ రాయించారు. అదే విధంగా ఎన్టీయార్ తన అల్లూరి సినిమా కోసం కొన్ని పాటలను కూడా రెడీ చేయించారు. సరైన సమయం చూసి సినిమా తీయాలనుకున్నారు.

అల్లూరి సీతారామరాజు డ్రై సబ్జెక్ట్ అని రచయితలు సూచించినా ఆయన నిర్మాణానికి వెనకాడలేదు. అయితే ఆయన వరస సినిమాతో బిజీగా ఉండడంతో కాలం ఇట్టే గడచిపోయింది. ఇక స్క్రిప్ట్ అంతా సిద్ధంగా ఉంది కాబట్టి ఏ క్షణం అనుకుంటే అపుడే సినిమా మొదలెట్టవచ్చు అన్నది అన్న గారి ఆలోచన. అయితే ఆయన తరువాత హీరోగా వెండితెరకు పరిచయం అయిన క్రిష్ణ చకచకా 99 సినిమాలను పూర్తి చేసి వందవ చిత్రంగా అల్లూరి సీతారామ‌రాజుని ప్రకటించారు. ఇక క్రిష్ణకు కూడా అల్లూరి మీద సినిమా తీయాలన్న కోరిక నిండుగా ఉంది.

దానికి కారణం ఆయన 12వ సినిమా అసాధ్యుడులో ఒక పాటలో అల్లూరిగా కనిపించి కనువిందు చేశారు. అలా అల్లూరి మీద ప్రేమ పెంచుకున్న క్రిష్ణ దాన్ని ప్రెస్టేజియస్ మూవీగా తీయాలని నూరవ చిత్రంగానే తీయాలనుకున్నారు. ఆనాటికి క్రిష్ణ స్టార్ డమ్ ఒక లెవెల్ లో ఉంది. వరస హిట్లతో దూకుడు మీద ఉన్నారు. ఇక ఆయన నిర్మాతగానూ రాణిస్తున్నారు. అందుకే పద్మాలయా బ్యానర్ మీద అల్లూరి సినిమా అనౌన్స్ చేయగానే ఎన్టీయార్ నుంచి తొలి అభ్యంతరం వచ్చింది. తాను చేయాలనుకున్న సినిమా, స్క్రిప్ట్ ఎపుడో రెడీ చేసుకున్నది అని ఎన్టీయార్ క్రిష్ణకు చెప్పారట.

అందువల్ల అల్లూరి విషయంలో తగ్గమన్నారుట. పైగా డ్రై సబ్జెక్ట్ అని కూడా చెప్పి చూశారుట. అయితే ఒకసారి డెసిషన్ తీసుకున్న క్రిష్ణ వెనక్కి తగ్గేందుకు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో ఆయన అల్లూరి సీతారామరాజు నిర్మించి 1974 మే 1న రిలీజ్ చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఎన్టీయార్ కల అలాగే ఉండిపోయింది. ఒక దశలో ఎన్టీయార్ పంతం పట్టి పరుచూరి బ్రదర్స్ ని అల్లూరి స్క్రిప్ట్ ని రెడీ చేయమన్నారుట. అయితే వారు క్రిష్ణ అల్లూరిని చూసిన తరువాత సినిమా తీయాలనుకుంటే తాము స్క్రిప్ట్ ఇస్తామని చెప్పారుట.

అలా క్రిష్ణ ఎన్టీయార్ కోసమే ప్రత్యేకంగా ఒక థియేటర్ లో అల్లూరి సినిమా ప్రదర్శిస్తే దాన్ని చూసిన ఎన్టీయార్ ఈ సినిమా సూప‌ర్. ఇంతకంటే ఎవరూ కూడా తీయలేరు అని తాను సినిమా తీయాలనుకున్న తన ఆలోచనను విరమించుకున్నారుట. అయినా అల్లూరి ఎన్టీయార్ ని అలా మదిలో దొలిచేస్తూనే ఉన్నాడు. దాంతో 1980లో వచ్చిన సర్దార్ పాపారాయుడు మూవీలో ఒక పాటలో ఫస్ట్ టైమ్ ఎన్టీయార్ వెండి తెర మీద అల్లూరిగా మెరిశారు. ఆయన ఆహార్యం, గాంభీర్యం చూసిన వారు అన్న గారు ఈ సినిమా ఎందుకు చేయలేదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి.

ఇక 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ మూవీలో కూడా ఒక పాటలో మరోసారి ఎన్టీయార్ అల్లూరి వేషం కట్టి తన ముచ్చట అలా తీర్చుకున్నారు. మొత్తానికి అల్లూరి విప్లవ వీరుడుగా చరిత్ర సృష్టిస్తే అన్న గారు పార్టీ పెట్టి తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా సేవ చేయడం ద్వారా చరితార్ధుడు అయ్యారు అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news