మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన తాజా సినిమా ఆచార్య. ఇటు కెరీర్‌లోనే తొలిసారిగా చిరుతో పాటు తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు అటు ప్లాప్ అన్నదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోయిన కొరటాల శివ దర్శకుడు కావడంతో పాటు ఆచార్యపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఆచార్య ఊహించని విధంగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇద్దరు మెగా స్టార్ హీరోలు ఉన్నా కూడా మినిమం ఓపెనింగ్స్ కూడా ఆచార్య రాబట్టుకోలేకపోయింది. సినిమా డిజాస్టర్‌గా ట్రేడ్ వర్గాలు సైతం తేల్చేశాయి. అయితే కర్ణుడు చావుకు లక్ష కారణాలు అన్నట్టు ఆచార్య సినిమా ప్లాప్‌నకు చాలా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. చిరు రేంజ్‌నకు తగిన కథను కొరటాల తీసుకోలేదు అని కొందరు అంటుంటే.. మరి కొందరు కథలో ముందు అనుకున్న దాంతో పోలిస్తే మార్పులు, చేర్పులు చేయడం కూడా మరో కారణం అంటున్నారు.
ఇక ఇటీవల వరుస ప్లాపులతో ఉన్న ఐరెన్ లెగ్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఉండడం కూడా మరో సెంటిమెంట్ అన్నారు. ఆమె ఇటీవల నటించిన రాధేశ్యామ్ – బీస్ట్ ఇప్పుడు ఆచార్య మూడు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో నెక్ట్స్ సినిమా అయినా డిజాస్టర్ అయిపోతుంది. త్రిబుల్ ఆర్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్‌చరణ్ ఆ వెంటనే ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్లాప్ అన్న మరో సెంటిమెంట్‌పై కూడా చర్చ జరిగింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్లాప్‌నకు మరో సెంటిమెంట్ కూడా తెరమీదకు తెస్తున్నారు. చిరంజీవికి ఆ అనే అక్షరం అచ్చి రాదని.. ఆ అక్షరంతో టైటిల్ వచ్చేలా చిరు చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయని మరో బ్యాడ్ సెంటిమెంట్ తెరమీదకు తెస్తున్నారు. చిరు కెరీర్‌లో ఆ అక్షరంతో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆచార్య ప్లాప్‌నకు అది కూడా ఓ కారణం అంటున్నారు.
చిరు గతంలో ఆరని మంటలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆలయ శిఖరం, ఆరాధన, ఆపద్బాంధవుడు సినిమాలు చేశారు. అవేవి కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అంజీ మూవీ కూడా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆ టైటిల్‌తో ఆచార్య రావడంతో ఆ అక్షరం బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఈ సినిమా ప్లాప్ అయ్యిందని అంటున్నారు. మరో విశేషం ఏంటంటే అ అక్షరంతో అన్నయ్య సినిమా చేస్తే హిట్ అయ్యింది. ఆ మాత్రమే కలిసి రాలేదు.