కొందరు హీరోల జీవితాల్లో కొన్ని సినిమాలు చాలా స్పెషల్‌గా మిగిలిపోతాయి. ఆ సినిమాలు హిట్టా… ప్లాపా అన్న దాంతో సంబంధం లేకుండా ఆయా హీరోల కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండి పోతాయి. అలాగే కొన్ని సంవత్సరాలు కూడా ఆయా హీరోలకు స్పెషల్‌గా ఉంటాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో చాలా హిట్ సినిమాలు వచ్చి ఆయనకు మరపురాని మధురానుభూతులు మిగిల్చాయి. అలాగే కొన్ని సంవత్సరాలు ఆయనకు వెరీ వెరీ స్పెషల్‌గా మిగిలిపోయాయి.
అలాంటి వాటిల్లో 1986 బాలయ్య కెరీర్‌లో ఆయనకు ఎప్పుడూ స్పెషల్ ఈయర్‌గా మిగిలిపోయింది. ఈ యేడాది బాలయ్యను తిరుగులేని స్టార్‌గా మార్చింది. మళ్లీ ఇలాంటి అరుదైన ఫీట్ బాలయ్యకు ఏ ఈయర్‌లోనూ రిపీట్ కాలేదు. ఈ యేడాది బాలయ్య ఏకంగా 6 హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అవి కూడా డబుల్ హ్యాట్రిక్ విజయాలు కావడం మరో విశేషం.
1986లో బాలయ్య హీరోగా నటించిన మొత్తం 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఫిబ్రవరి 07న విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక అదే ఫిబ్రవరి నెల 28న ముద్దుల కృష్ణయ్య రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్‌లోనే కోటి రూపాయాల షేర్ వసూలు చేసి సంచలనం నమోదు చేసింది. ఒక్క సెంటర్‌లో డైరెక్టుగా 100 రోజులు ఆడిన ఈ సినిమా…175 రోజులు కూడా ఆడి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక ఏప్రిల్ 15న రిలీజ్ అయిన సీతారాముల కళ్యాణం బాలయ్యకు క్లాస్‌లో మంచిపేరు తెచ్చిపెట్టింది. రోజు 5 షోలతో రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్షేషనల్ రికార్డు నమోదు చేసింది. ఇక జూలై 2న రిలీజ్ అయిన అనసూయమ్మ గారి అల్లుడు బాలయ్యకు ఫ్యామిలీ అభిమానుల్లో మాంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా ట్విన్ సిటీలలో రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అప్పట్లో రికార్డు. ఈ సినిమాతో బాలయ్యకు హ్యాట్రిక్ పడింది.
ఆ తర్వాత దేశోద్ధారకుడు ఆగస్టు 7న వచ్చింది. మాంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు డైరెక్ట్ 100 సెంటర్లు లేకపోయినా షిఫ్టులతో 100 రోజులు ఆడింది. సెప్టెంబర్ 19న విడుదలైన కలియుగ కృష్ణుడు కూడా కమర్షియల్ గా హిట్ అయింది. అక్టోబర్ 9న అపూర్వ సహోదరులు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేశారు.
ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. నాలుగు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమా షిప్టులతో 100 రోజులు ఆడింది. ఈ సినిమా రిలీజ్ టైంలో అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటి పోటీ తట్టుకుని సినిమా ఆడింది. ఇలా 1986లో బాలయ్యకు ఏ హీరోకు లేని విధంగా ఒకే యేడాది డబుల్ హ్యాట్రిక్ ఫీట్ నమోదు అయ్యింది.