టాలీవుడ్‌లో అగ్ర నటుడు చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరీర్‌లో మెగాస్టార్‌గా ఎదగడంతో పాటు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. చిరు ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటకీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ అదే జోష్‌తో ముందుకు వెళుతున్నాడు. ఖైదీ సినిమాతో చిరు స్టామినా ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. కెరీర్ ఆరంభంలోనే చిరు ప్రముఖ కమెడియన్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు.
చిరు సురేఖను పెళ్లి చేసుకున్నాక… అటు అల్లు రామలింగయ్య అండదండలతో పాటు అల్లు అరవింద్ సహాయ సహకారాలు కూడా కలిసి వచ్చాయి. చిరుతో సురేఖ పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పటికే హీరోగా ఉన్న చిరు ఎలాంటి వాడు అని అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో ఎంతో మందిని ఆరా తీశారట. చివరకు ఎన్టీఆర్‌కు కూడా ఈ విషయం చెప్పగా… పిల్లాడు మంచి భవిష్యత్తు ఉన్నవాడు.. కష్టపడుతున్నాడు.. పైకి వస్తాడని ఎన్టీఆర్ చెప్పారట.
చివరకు చిరు క్యారెక్టర్ ఎలాంటిదో తమ చెల్లెమ్మను ఇచ్చి పెళ్లి చేస్తున్నాం కదా ? అని అల్లు అరవింద్ కూడా తెరవనక చాలా ఎంక్వైరీలు చేశాడట. అయితే సురేఖను పెళ్లి చేసుకోవడం.. చిరు తండ్రి వెంకట్రావుకు ఇష్టం లేదట. ఈ విషయాన్ని స్టార్ ప్రొడ్యుసర్, నిర్మాత ధవళ సత్యం తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి హీరోగా ధవళ సత్యం దర్శకత్వంలో జాతర సినిమా తెరకెక్కింది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.
అయితే రామ్‌చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా జాతరకు కాపీగా వచ్చిందన్న ప్రచారం కూడా జరిగింది. రంగస్థలం సినిమా చూసిన చాలా మంది జాతర సినిమాను కాపీ చేసేశారని చెప్పారని కూడా సత్యం తెలిపారు. ఇక చిరంజీవి తండ్రికి సురేఖతో చిరు పెళ్లి ఇష్టం లేకపోవడానికి కారణాలు కూడా చెప్పారు సత్యం.
వాళ్లది కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో… వచ్చే కోడలు తమ కొడుకును ఎలా చూసుకుంటుందో ? అన్న సందేహం ఆయనకు ఉండేదని సత్యం చెప్పారు. సినీ నేపథ్యం ఉన్న అమ్మాయి తమ కుటుంబంలో ఉంటుందా ? ఇమడ గలుగుతుందా ? అన్న సందేహంతో ఆయన వీరి పెళ్లికి నిరాకరించారని సత్యం చెప్పారు. ఆ టైంలో అల్లు రామలింగయ్య ఫ్యామిలీ గురించి తాను చెప్పడంతో చిరు తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకున్నారని నాటి సంఘటనలను సత్యం గుర్తు చేసుకున్నారు.