దివంగత నటుడు, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ సినిమా రంగాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రాంతీయ పార్టీతో ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి చేసిన సేవతో పాటు ఆయన రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన నేపథ్యంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు.
అయితే పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వరకు కొంత వరకు ఆయనకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో రారాజుగా వెలిగిపోతోన్న ఎన్టీఆర్ కు అసలు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక కలిగింది.. ఆయనలో ఆ స్ఫూర్తి రగిలించింది.. సమాజ సేవ చేయాలన్న తాపత్రయం కలిగేలా చేసింది సర్దార్ పాపారాయుడు సినిమా అట.
బొబ్బిలి పులి, నాదేశం సినిమాలు కూడా ఆయనలో ఆ స్ఫూర్తి రగిలించాయని చెప్పినా.. అసలు పాపారాయుడు సినిమాలో అల్లూరి వేషధారణలో ఉండగానే ఆయనకు ప్రజాసేవ చేయాలన్న బలమైన కోరిక కలిగిందట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాతే ఆయన టీడీపీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.
ఎన్టీఆర్‌కు నాడు తెలుగు ప్రజలు రాజకీయంగా కూడా బ్రహ్మరథం పట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రధాన కారణం బొబ్బిలిపులి – నా దేశం – సర్దార్ పాపారాయుడు సినిమాలే. ఓవరాల్‌గా క్యారక్టర్ పరంగా చూస్తే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రాణం. ఆయన జీవిత చరిత్రను ఆయన సినిమాగా తీయాలని అనుకున్నారు. అయితే కృష్ణ ఆ కథతో ముందుగా సినిమా చేశారు.
అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం పాటలో వేసి తన కోరిక మరోసారి తీర్చుకున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ కెరీర్‌ను అల్లూరి సీతారామరాజు పాత్ర చాలా ప్రేరణ చేసిందని ఆయన సన్నిహితులతో తరచూ అనేవారట.