మెగా అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది ఆచార్య. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. చాలా ఏరియాల్లో అయితే ఇప్పటికే ఆచార్య ఫైనల్ రన్ కూడా దాదాపు ముగిసింది. మల్టీఫ్లెక్స్‌ల్లో కూడా నామ్‌కే వాస్తే షోలు మాత్రమే వేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన ఆచార్య ఊసురోమనిపించింది. ఆచార్యపై భారీ అంచనాలతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అయితే ఏకంగా యేడాది, యేడాదిన్నర క్రితమే అడ్వాన్సులు ఇచ్చి కూర్చున్నారు.
పైగా మెగాస్టార్‌తో పాటు రామ్‌చరణ్ కూడా కలిసి ఉండడంతో మెగాస్టార్ గత సినిమాల కంటే చాలా ఎక్కువ రేట్లకు ఆచార్యను కొన్నారు. అయితే బయ్యర్లు అందరూ నిలువునా మునిగిపోయారు. నైజాంలో అయితే ఈ సినిమాను వరంగల్ శ్రీను పబ్లిసిటీతో కలుపుకుని రు. 42 కోట్లకు కొన్నారు. ఇది చాలా చాలా ఎక్కువ. అంటే ఆల్‌మోస్ట్ బాహుబలి 1రేంజ్‌లో ఇక్కడ బిజినెస్ జరిగినట్టు లెక్క.
అయితే ఫస్ట్ డే.. ఫస్ట్ షోకే ఆచార్యలో సినిమాలో దమ్ము లేదని తేలిపోయింది. అన్ని ఏరియాల బయ్యర్లకు పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా వస్తుందన్న నమ్మకాలు లేవు. వరంగల్ శ్రీను ఒక్కడికే రు. 25 కోట్లకు పైగా నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు మూడు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాల కోసమే ఆచార్యను మిగిలిన చోట్ల కూడా ఖాళీ చేసేశారు.
ఆచార్య రిజల్ట్ ఇలా ఉంటే మెగాస్టార్ చిరు తన సతీమణి సురేఖతో కలిసి విదేశీ టూర్‌కు వెళ్లారు. దాదాపు 15 రోజులకు పైగా ఆయన అక్కడే గడిపి తిరిగి రానున్నారు. ఆచార్యను కొన్న వాళ్లంతా రన్నింగ్ బిజినెస్ చేసేవాళ్లు కావడంతో ఎంతెంత వెనక్కు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. పైగా సినిమా బిజినెస్ వ్యవహారాలు అంతా దర్శకుడు కొరటాల శివే చూసుకున్నాడు.
ఇప్పటికే ఆయన నైజాం బయ్యర్ వరంగల్ శ్రీనుకు హామీ ఇచ్చాడని అంటున్నారు. మరోవైపు కళ్యాణ్ కర్నాటక ( అంటే నైజాం – కర్నాకట బోర్డర్ ప్రాంతం.. ఒకప్పటి హైదరాబాద్ కర్నాటక ) బయ్యర్ తన గోడు వెళ్లబోసుకుంటూ మెగాస్టార్ చిరంజీవికే నేరుగా లేఖ రాశారు. చిరంజీవి – చెర్రీ ఛరిష్మాను నమ్ముకుని నైజాం బయ్యర్ శ్రీను నుంచి ఈ ప్రాంతం ఆచార్య రైట్స్ భారీ రేట్లకు తీసుకున్నానని.. యేడాది క్రితమే డబ్బులు కూడా ఇచ్చానని.. ఇప్పుడు తాను పెట్టిన పెట్టుబడిలో కనీసం 25 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని రాహుల్ బజాజ్ తన లేఖలో పేర్కొన్నాడు.
ఈ విషయంలో చిరంజీవి స్వయంగా కలుగ చేసుకుని న్యాయం చేస్తేనే.. తాను భవిష్యత్తులో మరో సినిమా పంపిణీ చేయగలుగుతానని.. లేకపోతే వ్యాపారం చేయలేనని కూడా చెప్పేశాడు. ఈ లేఖను బట్టే ఆచార్య ఎఫెక్ట్ బయ్యర్లపై ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. మరి చిరు కూడా జోక్యం చేసుకుని బయ్యర్లకు కొంత వరకు అయినా న్యాయం చేయకపోతే వాళ్లు ఇప్పట్లో ఏ మాత్రం కోలుకోలేని పరిస్థితి ఉంది.