నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో రౌడీ ఇన్‌స్పెక్టర్ ఒకటి. అప్పటికే బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్లో వచ్చిన లారీ డ్రైవర్ సూపర్ హిట్ అయ్యింది. ఇక బొబ్బిలి సింహం అన్న టైటిల్ ముందుగా రిజిసస్టర్ చేసుకుని దానికి అనుగుణంగా కథను అల్లుకుంటోన్న సమయంలో పరుచూరి సోదరులు తమిళంలో హిట్ అయిన చిన్నతంబి సినిమా రీమేక్ హక్కులు కొని దానిని బాలకృష్ణతో చేస్తే హిట్ అవుతుందని దర్శకుడు బి. గోపాల్‌కు సూచించారు. అయితే అప్పటికే ఆ రైట్స్ కేఎస్. రామారావు కొని వెంకటేష్ హీరోగా చంటి సినిమా తీస్తున్నారని తెలియడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
ఇక ఆంజనేయ పుష్పానంద్ చెప్పిన కథ విన్న పరుచూరి బ్రదర్స్ చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాను ఓకే చేశారు. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత టి. త్రివిక్రమ రావు ఈ సినిమాను నిర్మించారు. బి. గోపాల్‌కు ఈ సినిమాను డైరెక్ట్ చేసినందుకు నిర్మాత భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక హీరోగా బాలయ్యను ముందుగానే ఫిక్స్ అయిపోయారు. హీరోయిన్ కోసం పలువురు పేర్లు విన్నా.. అప్పటికే లారీ డ్రైవర్లో బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ తాను బాగా డైరెక్ట్ చేయడంతో గోపాల్ మళ్లీ విజయశాంతినే ఫిక్స్ చేశారు.
సినిమాలో దర్శకుడు గోపాల్ ఊటీలో కొన్ని సీన్లు షూట్ చేస్తుండగా… అదే టైంలో హైదరాబాద్‌లో రెండు, మూడు సీన్లను పరుచూరి బ్రదర్స్ డైరెక్ట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆ రోజుల్లో పలు కేంద్రాల్లో 175 రోజులతో పాటు కొన్ని సెంటర్లలో 200 రోజులు కూడా ఆడింది. కెవి. మహదేవన్ సంగీతం అందించిన ఆల్బమ్ అదిరిపోయే హిట్ అయ్యింది. అసలు ఈ సినిమాలో పాటలు ఇప్పటకీ వింటుంటే కొత్తగా ఉంటాయి.
ఈ సినిమాలోని ఆరే ఓ రంబ సాంగ్‌నే కళ్యాణ్‌రామ్ పటాస్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ సినిమాను హిందీతో పాటు తమిళ్‌లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఏ తెలుగు హీరోకు లేని విధంగా తెలుగు – తమిళం – హిందీ భాషల్లో 175 రోజులు ఆడిన ఏకైక సినిమాగా రౌడీ ఇన్‌స్పెక్టర్ తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. ఒంటిమీద ఖాకీ డ్రెస్ ఉంటేనే నేను ఇన్‌స్పెక్టర్‌ను.. లేకపోతే నిన్ను మించిన రౌడీనిరా అని బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు సినిమా అంతా ఉన్నాయి. ఈ సినిమా విజయంలో ఇవి కూడా కీలకమయ్యాయి.
హైదరాబాద్‌లోని సంధ్య 35 ఎంఎంలో అప్పటికి 12 సంవత్సరాల ఆ థియేటర్ చరిత్రలో 100 రోజులకు 22,86,748 రూపాయలు వసూలు చేసి తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అప్పట్లో ఈ థియేటర్ యాజమాన్యం ఇచ్చిన పేపర్ ప్రకటన సంచలనం రేపింది. ఈ సినిమా తర్వాత ఏడేళ్ల పాటు మళ్లీ బాలయ్య – బి. గోపాల్ సినిమా రాలేదు. తిరిగి 1999లో సమరసింహారెడ్డి సినిమాతో మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వచ్చి హ్యాట్రిక్ కొట్టింది.